అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Local Body Elections | స్థానిక సంస్థల ఎన్నికల అంశం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. హైకోర్టు తాజా తీర్పు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 42 శాతం బీసీ రిజర్వేషన్ల(BC Reservations) జీవోపై స్టే విధించిన న్యాయస్థానం.. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడం లేదని స్పష్టం చేసింది.
పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించుకునేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని తేల్చి చెప్పింది. తద్వారా ఎన్నికల అంశాన్ని అటు ప్రభుత్వం, ఇటు ఎన్నికల సంఘం(Election Commission)పైకి నెట్టేసింది. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ప్రభుత్వం, ఈసీ తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటాయన్న దానిపైనే అందరి దృష్టి నెలకొంది.
Local Body Elections | జోక్యం చేసుకోలేదన్న కోర్టు..
స్థానిక సంస్థల ఎన్నికల్లో(Local Body Elections) బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఇటీవల జీవో నెం.9 జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, రిజర్వేషన్లు 50 శాతానికి మించొదన్న సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో జీవో చట్టబద్ధతను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన న్యాయస్థానం.. జీవో నెం.9పై స్టే విధించింది. అదే సమయంలో బీసీ రిజర్వేషన్లను పెంచకుండా పాత విధానంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎలాంటి అడ్డంకులు లేవని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ గౌస్ మీరా మోహియొద్దీన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలును మాత్రమే నిలిపివేస్తున్నట్టు, ఎన్నికల నోటిఫికేషన్ అమలును నిలిపివేయలేదని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా పాత విధానంలో ఎన్నికలు నిర్వహించవచ్చునని పేర్కొన్నది. ఎన్నికల నోటిఫికేషన్(Election Notification) ప్రకారం పాత విధానంలో అంటే బీసీలకు 25 శాతం, ఎస్సీలకు 15, ఎస్టీలకు 10 శాతం చొప్పున కేటాయిస్తూ ఎన్నికలు నిర్వహించవచ్చునని స్పష్టంచేసింది. పాత పద్ధతిలో సీట్ల రిజర్వేషన్ల ప్రక్రియను సవరించి ఆమేరకు సీట్లు, రిజర్వేషన్లు ప్రకటించి ఎన్నికల ప్రక్రియ కొనసాగించవచ్చని చెప్పింది.
Local Body Elections | న్యాయ నిపుణులతో ఈసీ చర్చలు
స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా దృష్టి సారించింది. జీవో నెం.9 41పై హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు ఈసీ రెండ్రోజుల క్రితం ప్రకటన విడుదల చేసింది. అయితే, తాజాగా హైకోర్టు(High Court) ఉత్తర్వులు బయటకు రావడంతో ఈసీ పునరాలోచనలో పడింది. పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో తదుపరి చర్యలపై రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఈ మేరకు శనివారం న్యాయ నిపుణులతో సమావేశమైంది. హైకోర్టు ఉత్తర్వులపై న్యాయ నిపుణులతో సుదీర్ఘంగా చర్చలు జరిపింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు తదుపరి ఎన్నికలు వెళ్లాలా.. లేదా ? అన్న అంశంపై చర్చించింది. మరోవైపు, పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరాలని యోచిస్తున్న ఈసీ.. ఈమేరకు సర్కారుకు లేఖ రాయాలని భావిస్తోంది.
Local Body Elections | ప్రభుత్వ నిర్ణయంపైనే ఆధారం..
స్థానిక సంస్థల ఎన్నికల్లో జోక్యం చేసుకోలేదని హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో.. ఇప్పుడు అందరి దృష్టి ప్రభుత్వంపైనే నెలకొంది. పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికల నిర్వహణపై ముందుకెళ్తారా.. లేక ఇచ్చిన మాట మేరకు 42 శాతం రిజర్వేషన్లు సాధ్యమయ్యే వరకూ వాయిదా వేస్తారా? అన్నది సందిగ్ధంగా మారింది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారంగానే ఈసీ ముందుకెళ్లనుంది. ఈ నేపథ్యంలో సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బీసీలకు ఇచ్చిన మాట ప్రకారం 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలకు వెళ్లాలని రేవంత్ సర్కారు పట్టుదలతో ఉంది. అందుకే హైకోర్టు స్టే విధించడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు(Supreme Court)కు వెళ్లాలని యోచిస్తోంది. ఈ వ్యవహారంపై చర్చించేందుకు ఈ నెల 16న మంత్రిమండలి సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేబినెట్ భేటీలో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకోనుంది.