అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rajasthan | మాజీ ఎన్ఎస్జీ కమాండో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయాడు. ముంబై ఉగ్రదాడికి పాల్పడిన టెర్రరిస్టులతో పోరాడిన కమాండో డ్రగ్స్ దందా నడుపుతూ దొరకడం చర్చనీయాశంగా మారింది. ఆయన తెలంగాణ, ఒడిశా నుంచి రాజస్థాన్‌కు స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు చిక్కాడు.
రాజస్థాన్‌కు (Rajasthan) చెందిన బజరంగ్ సింగ్ పదో తరగతి అయిపోగానే చదువు మానేశాడు. అనంతరం బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో ఉద్యోగం చేరారు. ఏడేళ్ల పాటు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG) కమాండోగా పని చేశాడు. 2008 ముంబై ఉగ్రదాడుల (Mumbai Terror Attacks) సమయంలో చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో ఆయన పాల్గొన్నాడు. ఈ ఉగ్రదాడిలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే బజరంగ్ సింగ్‌కు రాజకీయాల్లో ఎదగాలనే కోరిక ఉండేది. దీంతో 2021లో ఆయన తన భార్యను ఎన్నికల్లో పోటీ చేయించాడు. ఆ సమయంలో ఆమె ఓడిపోయింది.
Rajasthan | పరిచయాలు పెరగడంతో..
రాజకీయాల్లో తన భార్య ఓడిపోయినా.. ఆయనకు మాత్రం పరిచయాలు పెరిగాయి. ఈ క్రమంలో అంతర్రాష్ట్ర స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ను నిర్మించుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఒడిశా, రాజస్థాన్‌లోని నేరస్థులతో బజరంగ్ సంబంధాలు పెంచుకున్నాడు. భారీగా గంజాయి స్మగ్లింగ్ చేస్తూ డబ్బులు సంపాదించడం మొదలు పెట్టాడు. దీంతో అతనిపై రాజస్థాన్‌కు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, యాంటీ నేషనల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు (Task Force Police) ఆపరేషన్ చేపట్టారు. కొన్ని నెలలు అతడి కదలికలపై నిఘా పెట్టారు. బజరంగ్ సింగ్‌కు ఒక అలవాటు ఉంది. దాంతోనే ఆయన పోలీసులకు చిక్కాడు. సింగ్ ఎక్కడకి వెళ్లిన తన వెంట ఒక వంట మనిషిని తీసుకు వెళ్తాడు. ఆ కుక్ కదలికలపై నిఘా పెట్టడంతో బజరంగ్ ఆచూకీ పోలీసులకు దొరికింది. దీంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.