అక్షరటడే, వెబ్‌డెస్క్ : Pedda Reddy | వైసీపీ (YCP) నేత, తాడిపత్రి (Tadipathri) మాజీ ఎమ్మెల్యే 15 నెలల తర్వాత సొంతింట్లో అడుగు పెట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయన పోలీసు భద్రత మధ్య ఇంటికి వెళ్లారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాడిపత్రిలో తీవ్ర ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీ నేతలు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడి చేశారు. టీడీపీ జెండా ఎగుర వేశారు. శాంతిభద్రతల కారణాలతో ఆయను తాడిపత్రి రాకుండా పోలీసులు అప్పటి నుంచి అడ్డుకుంటున్నారు. పెద్దారెడ్డి వస్తే అడ్డుకుంటామని టీడీపీ నేతలు పలుమార్లు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు ఆయనను తాడిపత్రిలోకి అనుమతించలేదు.
Pedda Reddy | సుప్రీం ఆదేశాలతో..
తనను తాడిపత్రిలోకి రానీయకుండా అడ్డుకోవడంతో పెద్దారెడ్డి గతంలో ఏపీ హైకోర్టు (High Court)ను ఆశ్రయించారు. దీంతో ఏకసభ్య ధర్మాసనం ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయినా కానీ పోలీసులు ఆయనను రానివ్వలేదు. దీంతో పెద్దారెడ్డి పోలీసులపై కోర్టు ధిక్కారణ పిటిషన్ వేశారు. దీనిని విచారించిన ద్విసభ్య ధర్మాసనం సింగిల్ జడ్జి తీర్పుపై స్టే విధించారు. దీంతో మాజీ ఎమ్మెల్యే సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించారు. సొంత నియోజకవర్గంలోకి వెళ్లకుండా ఆయనను అడ్డుకోవడం సరికాదని కోర్టు వ్యాఖ్యానించింది. తాడిపత్రి వెళ్లడానికి పోలీసులు భద్రత కల్పించాలని ఆదేశించింది. అంతేగాకుండా ఆయన ప్రైవేట్ భద్రతను ఏర్పాటు చేసుకోవచ్చని పేర్కొంది. దీంతో శనివారం ఆయన తన ఇంటికి వెళ్లారు.
Pedda Reddy | ఎస్పీ ఆధ్వర్యంలో భద్రత
సుప్రీం ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి శనివారం ఉదయం తాడిపత్రిలోని తన స్వగృహానికి చేరుకున్నారు. ఆయనకు ఎస్పీ జగదీశ్‌రెడ్డి (SP Jagadish Reddy) ఆధ్వర్యంలో భద్రత కల్పించారు. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా 672 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పెద్దారెడ్డి మాట్లాడుతూ.. పోలీసులకు అన్ని విధాల సహకరిస్తానని చెప్పారు. నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.