అక్షరటుడే, వెబ్డెస్క్ : Former MLA Jeevan Reddy | నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ (Armoor) నియోజకవర్గ కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు (Kalvakuntla Chandrashekar Rao) ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టారు.
ఈ నిరసనకు పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (Jeevan Reddy) నేతృత్వం వహించారు. ఉదయం నుంచే బీఆర్ఎస్ నాయకులు ఆర్మూర్ పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి చేరుకొని ర్యాలీ నిర్వహించారు. పార్టీ జెండాలు, నినాదాలతో పట్టణ వీధుల్లో ఊరేగింపుగా సాగిన ఈ నిరసన ర్యాలీ అంబేద్కర్ చౌరస్తాకు చేరుకుంది.
Former MLA Jeevan Reddy | పరిస్థితి ఉద్రిక్తం..
అక్కడ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దిష్టిబొమ్మను తీసుకువచ్చి దగ్ధం చేశారు. నాయకులు, కార్యకర్తలు మెడలో నల్ల కండువాలు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడం రాజకీయ కక్షసాధింపేనని ఆరోపిస్తూ ప్రభుత్వం వెంటనే తన వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు పరిస్థితిని అదుపులో ఉంచేందుకు ప్రయత్నించారు. ర్యాలీ అనుమతి పరిమితులను దాటుతోందని హెచ్చరించిన పోలీసులు దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయగా స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. ఈ తోపులాటలో జీవన్ రెడ్డి స్పృహ తప్పి కిందపడిన ఘటన ఉద్రిక్తతను మరింత పెంచింది. దీంతో అక్కడున్న బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కొంతసేపు అంబేద్కర్ చౌరస్తా పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం అదనపు పోలీసు బలగాలు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని నియంత్రించాయి. నాయకులను చర్చలకు పిలిచి శాంతియుతంగా నిరసన ముగించాలని విజ్ఞప్తి చేశారు. కొంతసేపటి తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చినప్పటికీ, పట్టణంలో ఉద్రిక్త వాతావరణం కొనసాగింది.