Guvvala Balaraju

Guvvala Balaraju | బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Guvvala Balaraju | అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు(Former MLA Guvvala Balaraju) బీజేపీలో చేరారు. ఇటీవల ఆయన బీఆర్​ఎస్​కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్(Rajya Sabha MP Lakshman)​ సమక్షంలో గువ్వల బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌ రావు ఆయనకు పార్టీ సభ్యత్వాన్ని అందజేశారు.

 Guvvala Balaraju | బీఆర్​ఎస్​ జీరో అయింది

గువ్వల చేరిక సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు రాంచందర్​రావు(BJP President Ramchandra Rao) మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ బలపడుతోందన్నారు. బీజేపీని ఎగతాళి చేసిన బీఆర్‌ఎస్‌ పరిస్థితి ఇప్పుడు జీరోకి చేరిందని వ్యాఖ్యలు చేశారు. పార్టీ బలోపేతానికి గువ్వల సేవలను వినియోగించుకుంటామన్నారు.

 Guvvala Balaraju | అందుకే చెప్పలేదు

గువ్వల బాలరాజు 20 ఏళ్లుగా బీఆర్​ఎస్​(BRS)లో కొనసాగుతున్నారు. 2009లో బీఆర్​ఎస్​ నుంచి నాగర్​కర్నూల్​ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 2014, 2018 ఎన్నికల్లో బీఆర్​ఎస్​ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రభుత్వ విప్​గా కూడా పని చేశారు. 2023 ఎన్నికల్లో ఓడిన ఆయన ఇటీవల పార్టీకి రాజీనామా చేశారు. అయితే తన రాజీనామాపై ఎవరితో చర్చించలేదని గువ్వల తెలిపారు. ముందే చెబితే బీఆర్​ఎస్​ వాళ్లు తనపై నిందలు వేస్తారని తెలుసన్నారు. వ్యక్తిత్వ హనానికి యత్నించి, తనపై ముద్ర వేసి బయటకు పంపే ప్రయత్నాలు చేసేవారన్నారు. అందుకే రాజీనామా విషయంలో ఎవరితో చర్చించలేదని తెలిపారు.

 Guvvala Balaraju | కాంగ్రెస్​ వారు అడిగారు

తమ పార్టీలో చేరమని కాంగ్రెస్​ నాయకులు సైతం తనను అడిగినట్లు గువ్వల తెలిపారు. అయితే దేశం కోసం, బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసే బీజేపీలో చేరాలని తాను నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తాను పదవుల కోసం పార్టీలో చేరలేదని స్పష్టం చేశారు. సామాన్య కార్యకర్తలాగా తాను బీజేపీ(BJP)లో ప్రయాణం మొదలు పెడతానన్నారు. 20 ఏళ్లపాటు బీఆర్​ఎస్​లో నిబద్ధతతో పని చేశానన్నారు. ఇప్పుడు బీజేపీలో కూడా అలాగే పనిచేస్తానని చెప్పారు.