అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Balka Suman Remand | చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయనను ఆదిలాబాద్ (Adilabad) జిల్లా జైలుకు తరలించారు.
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి (Kyathanpally) మున్సిపల్ ఛైర్పర్సన్ ఎన్నిక రెండు సార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. మంగళవారం ఎన్నిక కోసం ఎక్స్ అఫీషియో ఓటు హక్కు వినియోగించుకోవడానికి మంత్రి వివేక్ (Minister Vivek), ఎంపీ వంశీకృష్ణ వచ్చారు. మంత్రి వివేక్ కాన్వాయ్‌పై బీఆర్ఎస్ నాయకులు దాడి చేశారు. మాజీ ఎమ్మెల్యే సైతం దాడిలో పాల్గొన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయనపై కేసు నమోదు చేశారు. బుధవారం తీవ్ర ఉద్రిక్తత మధ్య క్యాతనపల్లిలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. బీఆర్ఎస్ (BRS) నాయకులు అడ్డుకున్న బలవంతంగా.. బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరు పర్చగా.. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.
Balka Suman Remand | ఖండించిన కేటీఆర్
మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై అక్రమ కేసులు పెట్టడమే కాకుండా దుర్మార్గంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. క్యాతనపల్లి మున్సిపాలిటీని దౌర్జన్యంగా కైవసం చేసుకోవాలన్న కుట్రలో భాగంగానే అక్రమ అరెస్టుకు తెరలేపారని ఆరోపించారు. బీఆర్ఎస్ స్పష్టమైన మెజారిటీ సాధించినప్పటికీ సీఎం రేవంత్ (CM Revanth), మంత్రి వివేక్ కలిసి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న కొందరు పోలీసులు తమ వైఖరి మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కేటీఆర్ హెచ్చరించారు. బాల్క సుమన్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Balka Suman Remand | అప్రజాస్వామిక చర్య
క్యాతనపల్లిలో కాంగ్రెస్ అప్రజాస్వామిక చర్యలను అడ్డుకున్నందుకు దళిత నాయకుడు బాల్క సుమన్‌ను అరెస్ట్ చేశారని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. బీఆర్ఎస్కు పూర్తి మెజారిటీ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని పరిహసించిన తీరు చూసి తెలంగాణ అసహ్యించుకుంటున్నదన్నారు. అధికార బలం, పోలీసు బలం, ధన బలంతో చట్టాలను తుంగలో తొక్కడం కాంగ్రెస్ అరాచక వైఖరికి పరాకాష్ట అని విమర్శించారు.
జనగామలో దళిత మహిళా కౌన్సిలర్ బీఆర్ఎస్కు మద్దతుగా చెయ్యి ఎత్తితే రిటర్నింగ్ ఆఫీసర్ సాక్షిగా కాంగ్రెస్ కౌన్సిలర్ దాడి చేశారన్నారు. అయినా అధికారులు అడ్డుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తొర్రూరు, జనగాం, ఇబ్రహీంపట్నం, జహీరాబాద్ సహా హంగ్ వచ్చిన ప్రతి చోటా ప్రజా తీర్పును గౌరవించకుండా ఛైర్మన్ పీఠాలను అడ్డదారుల్లో దక్కించుకున్నారని ఆరోపించారు.