అక్షరటుడే, వెబ్డెస్క్ : Urea Shortage | రాష్ట్రంలో యూరియా (Urea) కొరతతో రైతులు (Farmers) తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యూరియా బస్తాల కోసం అన్నదాతలు ఉదయం నుంచి రాత్రి వరకు సొసైటీల వద్ద పడిగాపులు కాస్తున్నారు.
ప్రస్తుతం వరి పంటకు యూరియా అవసరం. ఈ సమయంలో యూరియా వేయకపోతే పంట దిగుబడి తగ్గుతుంది. అయితే రాష్ట్రంలో సరిపడా యూరియా సరఫరా కాకపోవడంతో కొరత నెలకొంది. దీంతో రైతులు ఉదయం నుంచే సొసైటీల వద్ద బారులు తీరుతున్నారు. అయినా సరిపడా యూరియా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ (Former Minister Satyavati Rathod) యూరియా కోసం లైన్లో నిల్చున్నారు.
Urea Shortage | సోషల్ మీడియాలో వైరల్
మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా కురవి మండలంలోని గుండ్రాతిమడుగు రైతు వేదిక వద్ద ఆదివారం ఉదయం యూరియా పంపిణీ చేపట్టారు. ఈ విషయం తెలిసి భారీ ఎత్తున రైతులు రైతు వేదిక వద్దకు వచ్చారు. మహిళా రైతులు సైతం బారులు తీరారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కూడా ఎరువుల కోసం గంట సేపు లైన్లో నిల్చున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Urea Shortage | ఒకే బస్తా ఇచ్చారు
తనకు ఐదున్నర ఎకరాల భూమి ఉన్నట్లు సత్యవతి రాథోడ్ తెలిపారు. అయితే అధికారులు ఒకే యూరియా బస్తా ఇచ్చారని ఆమె చెప్పారు. ఒక బస్తా ఏం సరిపోతుందని ఆమె ప్రశ్నించారు. రైతుల కష్టాలు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని విమర్శించారు. రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.