Homeతాజావార్తలుHarish Rao | జోర్డాన్​లో చిక్కుకున్న వారిని కాపాడిన మాజీ మంత్రి హరీశ్​రావు

Harish Rao | జోర్డాన్​లో చిక్కుకున్న వారిని కాపాడిన మాజీ మంత్రి హరీశ్​రావు

జోర్డాన్​లో చిక్కుకున్న 12 మంది కార్మికులు శనివారం ఉదయం హైదరాబాద్​ చేరుకున్నారు. మాజీ మంత్రి హరీశ్​రావు వారి తరఫున కంపెనీకి జరిమానా కట్టి ఇండియాకు రప్పించారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Harish Rao | బతుకు దెరువు కోసం జోర్డాన్ వెళ్లి చిక్కుకున్న 12 మందిని మాజీ మంత్రి హరీశ్​రావు స్వస్థలానికి చేర్చారు. జోర్డాన్​లో వారు పనిచేసే కంపెనీకి పెనాల్టీతో పాటు, రవాణా ఖర్చును భరించి బాధితులను ఆయన హైదరాబాద్​కు రప్పించారు.

తెలంగాణ (Telangana)కు చెందిన 12 మంది బతుకు దెరువు కోసం గతంలో జోర్డాన్ వెళ్లారు. అయితే ఏజెంట్​ మోసాలకు బలై అక్కడ చిక్కుకుపోయారు. దీంతో తమను కాపాడాలని వేడుకున్నారు. ఈ మేరకు స్పందించిన మాజీ మంత్రి హరీశ్​రావు చర్యలు చేపట్టారు. అక్కడి కంపెనీతో మాట్లాడి వారి తరఫున ఆయన పెనాల్టి చెల్లించారు. శనివారం ఉదయం బాధితులు శంషాబాద్​ ఎయిర్​పోర్టులో చేరుకున్నారు. అనంతరం నేరుగా హరీశ్​ రావు ఇంటికి వెళ్లి కలిశారు. ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

Harish Rao | పట్టించుకోని ప్రభుత్వాలు

కాంగ్రెస్ ప్రభుత్వానికి (Congress Government), బీజేపీ ఎంపీలకు ఎన్ని సార్లు తమ సమస్య చెప్పుకున్నా పట్టించుకోలేదని బాధితుల ఆవేదన వ్యక్తం చేశారు.తమను తిరిగి భారత దేశానికి తీసుకొచ్చిన హరీశ్​రావుకు, బీఆర్ఎస్ పార్టీకి ధన్యవాదాలు తెలిపారు. బాధితులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని, అందుకే కేసీఆర్ ఆదేశాల మేరకు వారిని సొంత ఖర్చుతో స్వదేశానికి తీసుకువచ్చామని హరీశ్​రావు తెలిపారు.

Harish Rao | వారిని రక్షించాలి

బతుకు దెరువు కోసం గల్ఫ్​ దేశాలకు వెళ్లి ఎంతో మంది కార్మికులు ఏజెంట్ల మోసాలకు బలైపోతున్నారని హరీశ్​రావు (Harish Rao) ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అలాంటి వారిని రక్షించాలని కోరారు. కామారెడ్డి, నిర్మల్​, నిజామాబాద్​,మెదక్​, సిద్దిపేట, జగిత్యాల జిల్లాలకు చెందిన చాలా మంది గల్ఫ్​ దేశాల్లో చిక్కుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సాయం అడిగిన స్పందించలేదన్నారు. తాజాగా జోర్డాన్ (Jordan)​లో చిక్కుకున్న 12 మందిని బీఆర్​ఎస్​ తరఫున జరిమానా కట్టి స్వదేశానికి రప్పించామన్నారు. వందలాది మంది గల్ఫ్​ దేశాల్లో చిక్కుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) గల్ఫ్​ కార్మికులకు అనేక హామీలు ఇచ్చారన్నారు. కానీ ఒకటి కూడా అమలు చేయడం లేదన్నారు. కేంద్ర మంత్రులు కిషన్​రెడ్డి (Kishan Reddy), బండి సంజయ్​ (Bandi Sanjay) చొరవ చూపి గల్ఫ్​లో చిక్కుకున్న వారిని కాపాడాటానికి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి, విదేశాల్లో చిక్కుకున్న మన ప్రజలను సురక్షితంగా ఇంటికి చేర్చాలని డిమాండ్ చేశారు.