అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Gade Innareddy | మాజీ మావోయిస్ట్, సామాజిక కార్యకర్త గాదె ఇన్నారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. జనగామ (Janagama) జిల్లా జాఫర్గడ్ మండల కేంద్రంలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు.
గాదె ఇన్నారెడ్డి మాజీ మావోయిస్ట్. ఆయన జన జీవన స్రవంతిలోకి కలిసిన తర్వాత సామాజిక కార్యకర్తగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో సైతం పాల్గొన్నారు. అయితే తాజాగా ఆయనను ఎన్ఐఏ (NIA) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం హైదరాబాద్ (Hyderabad)కు తరలించారు. ఉపా చట్టం కింద ఆయనపై కేసు నమోదు చేయడం గమనార్హం.
Gade Innareddy | మావోలకు అనుకూలంగా..
మావోయిస్ట్ (Maoist) కాతా రామచంద్రారెడ్డి సంస్మరణ సభలో నిషేధిత సీపీఐ (మావోయిస్టు) సంస్థకు మద్దతుగా గాదె ఇన్నారెడ్డి మాట్లాడారు. ఆయన రాజకీయ, సామాజిక అంశాలపై టీవీలకు ఇంటర్వ్యూలు ఇస్తుంటారు. ఇటీవల పలు ఇంటర్వ్యూలలో మావోయిస్ట్‌లకు మద్దతుగా మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్‌ను ఆయన వ్యతిరేకించారు. ఈ క్రమంలో ఎన్ఐఏ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. మొదట ఇన్నారెడ్డి ఇంట్లో సోదాలు చేశారు. ఆయన ఫోన్లు చెక్ చేశారు.
Gade Innareddy | భద్రతకు ముప్పు అని..
ఇన్నారెడ్డి చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడుతున్నారని ఎన్ఏఐ అధికారులు పేర్కొన్నారు. మావోయిస్ట్ అనుబంధ సంస్థ అయిన ఏబీఎంఎస్ (అమరుల బంధు మిత్రుల సంఘం) ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని గుర్తించారు. భద్రతా బలగాలపై తీవ్ర విమర్శలు వ్యక్తం చేశారని తెలిపారు. కాగా ఆ ప్రసంగం యూట్యూబ్‌లో అప్లోడ్ కావడంతో ఎన్ఐఏ అధికారులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆయనను నాంపల్లి కోర్టు (Nampally Court)లో హాజరుపర్చి రిమాండ్ చేసే అవకాశం ఉంది.