అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Shibu Soren | జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి (Jharkhand Former CM) శిబు సోరెన్ (81) మృతి చెందారు. జార్ఖండ్ ముక్తి మోర్చా సహ వ్యవస్థాపకుడైన శిబు సోరెన్ సోమవారం ఉదయం మృతి చెందినట్లు ఆయన కుమారుడు, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (Hemant Soren) తెలిపారు.
శిబు సోరెన్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మూత్రపిండాలకు సంబంధించిన సమస్యతో ఢిల్లీలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం ఉదయం 8:56 గంటలకు మరణించారు. ఆయన నెల రోజులుగా లైఫ్ సపోర్ట్‌పై ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
Shibu Soren | మూడు సార్లు ముఖ్యమంత్రిగా..
శిబు సోరెన్ జార్ఖండ్ రాజకీయాల్లో సుదీర్ఘ కాలం పని చేశారు. దుమ్కా ఎంపీగా ఎనిమిది సార్లు గెలుపొందారు. 2005లో 10 రోజులపాటు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పని చేశారు. 2008–09, 2009–10 వరకు మొత్తం మూడు సార్లు ఆయన సీఎం బాధ్యతలు నిర్వర్తించారు. జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించాడు. 38 ఏళ్లుగా జార్ఖండ్ ముక్తి మోర్చాకు నాయకుడిగా ఉన్నారు. ఈ పార్టీని బినోద్ బిహారీ మహతోతో కలిసి స్థాపించారు.
శిబు సోరెన్‌కు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. రెండో కుమారుడు హేమంత్ సోరెన్ ప్రస్తుతం జార్ఖండ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. కాగా శిబు సోరెన్ గతంలో కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు.