అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Punjab Former DGP | పంజాబ్ మాజీ డీజీపీ కుమారుడి మృతి కేసులో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. మొదట తమ కుమారుడు డ్రగ్స్ ఓవర్ డోస్‌తో మృతి చెందినట్లు డీజీపీ మొహమ్మద్ ముస్తఫా (Mohammad Mustafa), ఆయన భార్య, మాజీ మంత్రి రజియా సుల్తానా (Razia Sultana) పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా ఇది హత్యగా అనుమానిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు.
మాజీ డీజీపీ ముస్తాఫా కుమారుడి భార్యతో సంబంధం పెట్టుకున్నాడు. ఆ విషయం తెలియడంతో తన భార్యతో కలిసి కుమారుడిని హత్య చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటన హర్యానా (Haryana)లోని పంచకలాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 16 రాత్రి పంచకులాలో మాజీ డీజీపీ కుమారుడు అఖిల్ అక్తర్ (35) అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. మాన్సా దేవి కాంప్లెక్స్ ప్రాంతంలోని తన ఇంట్లో అఖిల్ అపస్మారక స్థితిలో ఉన్నట్లు అతని కుటుంబ సభ్యులు గుర్తించారని పోలీసులు గతంలో తెలిపారు. అనంతరం ఆస్పత్రికి తీసుకు వెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. తమ కుమారుడు డ్రగ్స్ ఓవర్ డోస్‌తో చనిపోయాడని వారు పోలీసులకు తెలిపారు.
Punjab Former DGP | ఇలా బయట పడింది
అఖిల్ అక్తర్‌కు తన భార్యతో తండ్రికి ఉన్న సంబంధం గతంలోనే తెలిసింది. దీంతో సోషల్ మీడియాలో పలు వీడియోలు పోస్టు చేశాడు. ఆగస్టులో పోస్ట్ చేసిన ఓ వీడియోలో ఆయన తన తండ్రి, భార్య మధ్య అక్రమ సంబంధాలను కనుగొన్నట్లు చెప్పాడు. అతని తల్లి, సోదరి కూడా తనను చంపడానికి, తప్పుడు కేసులో ఇరికించడానికి కుట్ర చేస్తున్నారని వాపోయాడు. తన భార్యతో తండ్రికి ఉన్న సంబంధం తెలిసినప్పటి నుంచి తాను మానసికంగా కుంగిపోయానని పేర్కొన్నాడు. ఈ సంబంధం గురించి ఇంట్లో అందరికీ తెలుసని, వాళ్లు తనను పిచ్చోడిని చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఆయన మరణించిన తర్వాత పంజాబ్ (Punjab)లోని మాలెర్‌కోట్లా నివాసి అయిన షంషుదీన్ చౌదరి అఖిల్ పోస్ట్ ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు మాజీ డీజీపీ ముస్తాఫాతో పాటు ఆయన భార్య, మాజీ మంత్రి రజియా సుల్తానాపై మంగళవారం కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో నిష్పాక్షిక దర్యాప్తు జరిగేలా చూడాలని షంషుదీన్ కోరారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.