అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Australia Former PM | భారతదేశం సూపర్ పవర్ గా ఎదిగిందని, చైనాను కట్టడి చేయడానికి ఇండియా కీలకమవుతుందని ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ అబాట్ అన్నారు. 21వ శతాబ్దం భారతదేశానిదన్న ఆయన.. నాలుగు లేదా ఐదు దశాబ్దాల తర్వాత అమెరికాను వెనక్కి నెట్టి భారత ప్రధాని ‘స్వేచ్ఛా ప్రపంచ నాయకుడు’ హోదాను పొందుతుందన్నారు.
ఎన్డీటీవీ వరల్డ్ సమ్మీట్‌లో (NDTV World Summit) శుక్రవారం ప్రసంగించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోని కొత్త సూపర్ పవర్ లలో ఒకటిగా, ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో చైనాకు ‘ప్రజాస్వామ్య ప్రతిరూపం’గా భారత్ నిలుస్తుందన్నారు. ఆస్ట్రేలియాకు బలమైన, నమ్మకమైన భాగస్వామిగా ఢిల్లీ కీలక పాత్రను పోషించాలని పిలుపునిచ్చారు.
Australia Former PM | బీజింగ్ ఆశయాలకు ఇండియా అడ్డుకట్ట
ప్రపంచ పెద్దన్నగా మారాలనుకుంటున్న చైనా ఆశయాలకు ఇండియా (India) గండికొడుతుందని అబాట్ అన్నారు. ఇప్పటికే అనేక దేశాలు చైనాకు దూరమవుతున్నాయని, ఇది మారుతున్న సంకేతానికి నిదర్శనమని చెప్పారు. 2022లో ఆస్ట్రేలియాతో, గత నెలలో యునైటెడ్ కింగ్డమ్తో భారతదేశం సంతకం చేసిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు ప్రజాస్వామ్య ప్రపంచం చైనా నుంచి మారుతున్న సంకేతాలని ఆయన అన్నారు. చైనా, పాకిస్తాన్, యూఎస్‌తో భారతదేశ సంబంధాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంపై ఆధిపత్యం బీజింగ్ ఆశయాలను అరికట్టడానికి ఢిల్లీ కీలకమని అన్నారు. “వారు ఆధిపత్య శక్తిగా ఎదగాలని కోరుకుంటున్నారు.. ఇది చైనా పొరుగు దేశాలతె సాటే మిగతా ప్రపంచానికి ఇబ్బందిని కలిగిస్తుందని.” అబాట్ పేర్కొన్నారు.
Australia Former PM | ‘చైనా కంటే ఇండియాకు ప్రయోజనాలు’
“భారతదేశం చైనాకు (China) ప్రతిరూపం. ఇది ఇప్పుడు అత్యధిక జనాభా కలిగిన దేశం. మీరు ఏ భారతీయ నగరానికైనా వెళ్లండి. కొత్త విమానాశ్రయాలు సహా భారీ మౌలిక సదుపాయాలు ఉన్నాయి. భారతదేశం అభివృద్ధి చెందుతోంది. రానున్న రోజుల్లో చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని” అభిప్రాయపడ్డారు. “ప్రధానమంత్రిగా, భారతదేశం ప్రజాస్వామ్య సూపర్ పవర్గా ఆవిర్భవిస్తుందని నేను చెప్పాను. సరే, ఇప్పుడు అది జరిగింది. భారత ప్రధాని రాబోయే 40-50 సంవత్సరాలలో స్వేచ్ఛా ప్రపంచానికి నాయకుడు అయ్యే అవకాశం ఉందని” తెలిపారు.
Australia Former PM | సుంకాల సమస్యపై..
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో ఇండియాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సుంకాలు విధించడాన్ని అబాట్ తప్పుబట్టారు. “నేను ట్రంప్‌నకు మద్దతుదారుడిని.. కానీ ఆ శిక్షాత్మక సుంకాలను విధించిన ఆయన భారతదేశంతో సరైన రీతిలో వ్యవహరించలేదని భావిస్తున్నాను.. ముఖ్యంగా ఇక్కడ మోసం చేస్తున్న చైనాలాంటి ఇతర దేశాలు ఉన్నాయి, వారికి అదే తరహా శిక్ష వేయలేదని” అబాట్ ఎత్తి చూపారు. రష్యాతో కోల్డ్ వార్ సమయంలోనూ అమెరికా పెద్ద తప్పు చేసిందన్నారు. భారతదేశం, దాని ఉదారవాద ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా అమెరికా అప్పట్లో సైనిక నియంతృత్వంలో ఉన్న పాకిస్తాన్ వైపు మొగ్గు చూపిందని తెలిపారు. “పాక్లో మంచి వ్యక్తులు ఉన్నారు.. కానీ అది ఇప్పటికీ ఇస్లామిక్ ధోరణి కలిగిన సైనిక సమాజం. భారతదేశం అందుకు భిన్నంగా ఉంటుంది. అమెరికా పాక్ తో కలిసి పనిచేయకూడదని నేను చెప్పడం లేదు.. కానీ దాని స్నేహితులు ఎక్కడ ఉన్నారో అది తెలుసుకోవాలని” అమెరికాపై సుతిమెత్తగా విమర్శలు చేశారు.