అక్షరటుడే, వెబ్డెస్క్ : ACB Trap | అటవీ శాఖ (Forest Department)లోని అవినీతి అధికారులను ఏసీబీ వల పన్ని పట్టుకుంది. ఇద్దరు సెక్షన్ అధికారులతో పాటు డ్రైవర్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు.
అటవీ శాఖలో కొందరు అధికారులు యథేచ్ఛగా అవినీతికి పాల్పడుతున్నారు. అటవీ భూములు కబ్జా అవుతున్నా.. డబ్బులు తీసుకొని పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే కలప తరలింపు కోసం వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కలప తరలించినా.. లంచాలు తీసుకొని వారిని ఏమి అనడం లేదు. తాజాగా వికారాబాద్ (Vikarabad) జిల్లా పరిగి అటవీ శాఖ రేంజ్ కార్యాలయం పరిధిలోని సెక్షన్ ఆఫీసర్లు (Forest Section Officers) బొల్లుమల్ల సాయికుమార్, మొహమ్మద్ మొయినుద్దీన్, డ్రైవర్ (పొరుగు సేవలు) బాలనగరం బాలకృష్ణను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
ACB Trap | పండ్లు రవాణా చేయడానికి..
పరిగి రేంజ్ అటవీ ప్రాంతం నుంచి బాటసింగారంలోని పండ్ల మార్కెట్ (Batasingaram Fruit market)కు సీతాఫలాలను రవాణా చేయడానికి అటవీ శాఖ అధికారులు సాయికుమార్, మొయినొద్దీన్ లంచం అడిగారు. ఫిర్యాదుదారుని వాహనాలకు ఆన్‌లైన్ ట్రాన్సిట్ పర్మిట్‌లను జారీ చేయడానికి రూ.40 వేల లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు శుక్రవారం లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులను సెక్షన్ అధికారులతో పాటు డ్రైవర్ను రెడ్ హ్యండెడ్గా పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
ACB Trap | లంచం అడిగితే ఫోన్ చేయండి
ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number), వాట్సాప్ నంబర్ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని భరోసా ఇస్తున్నారు. ఎంత మొత్తం లంచం అడిగినా.. వస్తురూపంలో బహుమతులు అడిగినా తమకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు.