అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ACB Trap | లంచం తీసుకుంటూ అటవీ శాఖ ఉద్యోగి ఏసీబీకి (ACB) చిక్కాడు. కలప వ్యాపారం చేసుకునే వ్యక్తి నుంచి రూ.20 వేలు తీసుకుంటుండగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ను అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
సూర్యాపేట (Suryapet) జిల్లా కోదాడ అటవీ రేంజ్ అధికారి (FRO) కార్యాలయంలో అనంతుల వెంకన్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. రేంజ్ పరిధిలో కలప వ్యాపారం చేసుకునే వ్యక్తిని వెంకన్న లంచం అడిగాడు. కలప వ్యాపారానికి ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండాలంటే తనకు రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీకి సమాచారం ఇచ్చాడు. ఈ మేరకు బుధవారం బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా వెంకన్నను ఏసీబీ అధికారులు (ACB Officers) రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
ACB Trap | పైసలు ఇస్తే పట్టించుకోరు
అడవులను సంరక్షించాల్సిన పలువురు అటవీ శాఖ సిబ్బంది (Forest officers) డబ్బులు దండుకోవడంపై దృష్టి పెట్టారు. పైసలు ఇస్తే అడవుల గురించి పట్టించుకోవడం లేదు. పలు గ్రామాల్లో వందలాది ఎకరాల అటవీ భూములను ఆక్రమిస్తున్నా అధికారులు అటువైపు చూడటం లేదు. మామూళ్లు తీసుకొని చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. చెట్లు నరుకుతున్నా కనీస చర్యలు చేపట్టడం లేదు.
ముఖ్యంగా బీట్ ఆఫీసర్లు తమ పరిధిలో జరుగుతున్న ఆక్రమణలపై అధికారులకు సమాచారం ఇవ్వడం లేదు. స్థానికంగా కబ్జా చేసే వారి నుంచి డబ్బులు తీసుకొని సైలెంట్‌గా ఉంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కలప వ్యాపారం, వడ్రంగి పని చేసేవారిపై మాత్రం తమ ప్రతాపం చూపుతున్నారు. లంచం ఇవ్వకపోతే వ్యాపారాలను సాగనివ్వమని బెదిరింపులకు దిగుతున్నారు.
ACB Trap | లంచం అడిగితే ఫోన్ చేయండి
ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు (ACB Officers) సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే ఏసీబీకి ఫోన్ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number), వాట్సాప్ నంబర్ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని భరోసా ఇస్తున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, ఆ పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.