అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Forensic Lab Fire Conspiracy | నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్ (Forensic Lab)లో అగ్ని ప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అనుమానాలు వ్యక్తం చేశారు. హన్మకొండ (Hanmakonda)లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఫోరెన్సిక్ ల్యాబ్‌లో శనివారం అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పలు కీలక పత్రాలు కాలిపోయినట్లు సమాచారం. ఈ క్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఓటుకు నోటు కేసులోని ఆధారాలను తగలబెట్టేందుకే రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఫోరెన్సిక్ ల్యాబ్‌ను తగలబెట్టించిండు అని రాష్ట్రంలోని ప్రజలు అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఒక నేరస్తుడే ముఖ్యమంత్రి, హోంమంత్రిగా ఉన్నాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Forensic Lab Fire Conspiracy | అందరు బిజీగా ఉండగా..
ఓటుకు నోటు కేసు ఆధారాలను కాల్చేసి శాశ్వతంగా బయటపడేందుకు, అందరూ మున్సిపల్ ఎన్నికల (Municipal elections) బిజీలో ఉండగా రేవంత్ రెడ్డి ఈ పన్నాగం పన్నినట్టు తాము అనుమానిస్తున్నామని కేటీఆర్ అన్నారు. అధికారులు ప్రెస్ నోట్లో ఏమో ఏమీ నష్టం జరగలేదు అని చెప్పి బుకాయించి.. FIRలో మాత్రం వివరంగా రాసి దొరికిపోయారని పేర్కొన్నారు. మంటలు అదుపు చేయడానికి మూడున్నర గంటలు పట్టిందన్నారు. మూడొంతస్తుల భవనంలో మంటలు ఆర్పడానికి మూడున్నర గంటల సమయం ఎందుకు పట్టిందని ఆయన ప్రశ్నించారు.
Forensic Lab Fire Conspiracy | రిటైర్డ్ జడ్జితో..
మొదటి అంతస్తులో మంటలు ఆర్పడానికి 3 గంటలు పట్టిందని, పెద్ద పెద్ద నేరస్తులకు చెందిన అతిముఖ్యమైన ఆధారాలు ఉండే ఫోరెన్సిక్ ల్యాబ్‌లో ఒక్క సిబ్బంది కూడా లేకపోవడంపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పెద్ద వాళ్ల హస్తం ఉందని అనుమానించారు. ఓటుకు నోటు కేసుకు సంబంధం ఉన్న మరొక పెద్దమనిషి హస్తం కూడా దీనిలో ఉందన్నారు. ఢిల్లీలో ఉన్న ప్రభుత్వం కొంతమంది మద్దతుతో నడుస్తుందని, వారికి ఈ ఓటుకు నోటు కేసులో సంబంధం ఉందని పరోక్షంగా చంద్రబాబు నాయుడును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వారు ఏమైనా ఆదేశాలు ఇస్తే ఇక్కడ సుపారీ తీసుకొని చేశారో కూడా తెలియదన్నారు. ఈ ఘటనపై రిటైర్డ్ జడ్జి ద్వారా విచారణ జరిపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.