అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Post Office Schemes | స్టాక్ మార్కెట్(Stock Market)లో ఎక్కువ లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే అవి రిస్క్‌తో కూడుకున్నవి. మంచి స్టాక్స్ ఎంచుకోకపోయినా, ఓపికతో లేకపోయినా, సరైన సమయంలో ప్రాఫిట్ బుక్ చేసుకోలేకపోయినా పెట్టుబడినీ కోల్పోవాల్సి రావొచ్చు.
ఈ రిస్క్ ఎందుకు అనుకునేవారు ఫిక్స్డ్ డిపాజిట్ల(Fixed Deposits)లో పెట్టుబడులు పెడుతుంటారు. అయితే ఎఫ్డీ కన్నా ఎక్కువ రిటర్న్స్‌ను అందిస్తున్నాయి పోస్టాఫీస్ స్కీములు(Post Office Schemes). ప్రభుత్వ హామీతో ఉండే పోస్టాఫీస్ పథకాలు పూర్తిగా సురక్షితంగా ఉంటాయి. మార్కెట్ హెచ్చుతగ్గుల వల్ల అవి ప్రభావితం కావు. దీంతో మూలధన నష్టానికి ఎటువంటి ప్రమాదం ఉండదు. పన్ను మినహాయింపులు, స్థిర వడ్డీ రేట్ల ప్రయోజనాలనూ అందిస్తాయి. ఏ స్కీమ్‌లో ఎంత వడ్డీ వస్తుందో తెలుసుకుందామా..
సుకన్య సమృద్ధి యోజన..
ఆడబిడ్డ భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సుకన్య సమృద్ధి యోజన (Sukanya Samriddhi Yojana) అత్యంత ప్రజాదరణ పొందింది. ఇది వార్షిక వడ్డీ రేటు 8.20 శాతం అందిస్తుంది. పెట్టుబడి మొత్తం సంవత్సరానికి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఉంటుంది. ఈ పథకం ఆడబిడ్డల చదువు, వివాహం వంటి ప్రధాన ఖర్చులను తీర్చడంలో సహాయపడుతుంది. ఇది కూడా పన్ను ప్రయోజనాలను అందిస్తుంది.
జాతీయ పొదుపు ధ్రువీకరణ పత్రం..
జాతీయ పొదుపు ధ్రువీకరణ పత్రం(National Savings Certificate) ప్రభుత్వం పూర్తిగా హామీ ఇచ్చే స్థిర ఆదాయ పథకం. దీనిపై ప్రస్తుతం 7.7 శాతం వడ్డీ రేటు వర్తిస్తోంది. కాలవ్యవధి ఐదేళ్లు. కనీసం వెయ్యి రూపాయలతో ఇందులో పెట్టుబడులు పెట్టవచ్చు. దీనికి కూడా పన్ను మినహాయింపు ప్రయోజనాలు పొందవచ్చు.
నెలవారీ ఆదాయ పథకం..
నెలవారీ స్థిరమైన ఆదాయం కోరుకునేవారికి (Monthly Income Scheme) ఉత్తమ ఎంపిక. ఈ పథకం ద్వారా 7.4 శాతం వడ్డీ రేటు అందుతుంది.. ఒక ఖాతాలో గరిష్టంగా రూ.9 లక్షలు, ఉమ్మడి ఖాతాలో గరిష్టంగా రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ప్రతినెలా వడ్డీ ఖాతాకు జమ అవుతుఉంది.
పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్..
ఫిక్స్డ్ డిపాజిట్ వంటిదే పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ పథకం(Time Deposit Scheme).. ఇందులో 1, 2, 3 లేదా 5 సంవత్సరాల కాలానికి పెట్టుబడి పెట్టవచ్చు. వడ్డీ రేటు సంవత్సరానికి 6.9 శాతం, 2, 3 సంవత్సరాలకు 7 శాతం, 5 సంవత్సరాలకు 7.5 శాతంగా ఉందిఇ. పెట్టుబడులు కనీసం వెయ్యి రూపాయలతో మొదలుపెట్టవచ్చు. ఐదేళ్ల వరకు డిపాజిట్లపై పన్ను మినహాయింపు లభిస్తుంది.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్..
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(Public Provident Fund) పథకం దీర్ఘకాలిక సురక్షిత పెట్టుబడి, పన్ను ఆదా రెండిరటినీ అందిస్తుంది. ప్రస్తుతం వార్షిక వడ్డీ రేటు 7.10 శాతంగా ఉంది. ఇందులో కనీస పెట్టుబడి మొత్తం రూ.500. గరిష్ట మొత్తం సంవత్సరానికి రూ. 1.5 లక్షలు. ఈ స్కీమ్ కాలపరిమితి 15 ఏళ్లు. దీనికి ఆదాయపు పన్ను మినహాయింపు కూడా వర్తిస్తుంది.