అక్షరటుడే, వెబ్డెస్క్ : Empty stomach | మన కడుపు మన గుండెతో అనుసంధానం చేసి ఉంటుందనే మాట తరచుగా వింటూ ఉంటాం. కానీ మన మొత్తం ఆరోగ్యం కడుపుతో (stomach) ముడిపడి ఉంటుందనేది వాస్తవం. కడుపు ఆరోగ్యంగా ఉంటేనే రోగాలకు దూరంగా ఉంటాం. ఒకవేళ కడుపు ఆరోగ్యం దెబ్బతింటే, అనారోగ్యాలు మన శరీరంపై దాడి చేయడం మొదలవుతుంది. అందుకే, ఏదైనా తినే ముందు మన జీర్ణ వ్యవస్థ (digestive system) గురించి తప్పకుండా ఆలోచించాలి.
ఈ మధ్య కాలంలో చాలా మంది సోషల్ మీడియాలో (Social Media) వచ్చే చిట్కాలు పాటించి, ఉదయం ఖాళీ కడుపుతో (empty stomach) ఏవేవో తీసుకుంటున్నారు. దీనివల్ల తెలియకుండానే అనారోగ్య సమస్యలను ఆహ్వానిస్తున్నారు. బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత కూడా మీకు రోజంతా నీరసంగా, బలహీనంగా అనిపిస్తే, మీరు తీసుకునే అల్పాహారంలో లోపాలున్నాయని గుర్తించాలి. ముఖ్యంగా, ఖాళీ కడుపుతో కొన్ని ఆహారాలు తినడం మన పొట్టకు హాని చేస్తుంది. మరి, వైద్య నిపుణుల సలహా ప్రకారం, ఉదయం ఖాళీ కడుపుతో ఎప్పుడూ తీసుకోకూడని ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సిట్రస్ జాతి పండ్లు (పుల్లని పండ్లు): నారింజ, నిమ్మ, లేదా ఉసిరి (ఆమ్లా) వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ ‘సి'(vitamin ‘C’)తో పాటు అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన రోగనిరోధక శక్తిని పెంచి, చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే, వీటిని ఖాళీ కడుపుతో అస్సలు తినకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఈ పండ్లలో ఉండే సిట్రిక్ ఆమ్లం (Citric Acid) నేరుగా కడుపులోని లోపలి పొరను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల కడుపులో మంట, నొప్పి, గ్యాస్ లాంటి సమస్యలు వస్తాయి. ఖాళీ కడుపుతో యాసిడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపులోని బ్యాలెన్స్ దెబ్బతింటుంది. కాలక్రమేణా, ఇది మన దంతాలపై ఉండే ఎనామెల్ పొరను కూడా బలహీనపరుస్తుంది. కాబట్టి, ఉదయం వీటిని తీసుకోవద్దు.
బ్లాక్ కాఫీ: చాలా మందికి ఉదయం నిద్ర లేవగానే బ్లాక్ కాఫీ లేదా టీ తాగే అలవాటు ఉంటుంది. కానీ ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగితే మీ జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం పడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్లాక్ కాఫీ జీర్ణవ్యవస్థకు యాసిడ్ మాదిరిగా పనిచేస్తుంది. ఉదయాన్నే దీన్ని తాగడం వల్ల కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట, అలాగే శక్తి లేనట్లుగా అనిపించడం జరుగుతుంది.
ఎక్కువ నూనెతో కూడిన ఆహార పదార్థాలు (ఫ్రైడ్ ఐటమ్స్): ఎక్కువ నూనెలో వేయించిన పదార్థాలు (ఆయిలీ ఫుడ్స్) ఆరోగ్యానికి అంత మంచివి కావు. చోలే భటూరే, పావ్ భాజీ, కచోరి వంటి బాగా వేయించిన ఆహారాలు ఖాళీ కడుపుతో తింటే రుచిగా ఉన్నప్పటికీ, అవి కడుపులో భారంగా ఉండి అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ఈ రకమైన ఆహారాలు కడుపుపై అనవసరమైన ఒత్తిడిని పెంచుతాయి. అందుకే, ఉదయం ఖాళీ కడుపుతో వీటిని తినకుండా ఉండడం ఉత్తమం అని వైద్యులు సలహా ఇస్తున్నారు.

