అక్షరటుడే, వెబ్‌డెస్క్: Biryani Orders | ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ స్విగ్గీ తన 10వ వార్షిక నివేదిక ‘హౌ ఇండియా స్విగ్గీడ్ 2025’(How India Swiggy’d in 2025)ను విడుదల చేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం భారతీయుల ఆహారపు అలవాట్లలో బిర్యానీకి ఉన్న క్రేజ్ ఈ ఏడాదీ తగ్గలేదని స్పష్టమైంది.
వరుసగా పదో ఏడాది కూడా దేశంలో అత్యధికంగా ఆర్డర్ చేసిన వంటకంగా బిర్యానీ అగ్రస్థానంలో నిలిచింది. 2025 సంవత్సరంలో భారతీయులు మొత్తం 9.3 కోట్ల బిర్యానీలను ఆర్డర్ చేసినట్లు స్విగ్గీ (Swiggy) వెల్లడించింది. ఈ గణాంకాలను పరిశీలిస్తే దేశవ్యాప్తంగా ప్రతి నిమిషానికి సగటున 194 బిర్యానీలు, అంటే ప్రతి 3.25 సెకన్లకు ఒక బిర్యానీ డెలివరీ (Biryani Delivery) అయినట్లు తెలుస్తోంది. వీటిలో చికెన్ బిర్యానీ 5.77 కోట్ల ఆర్డర్లతో టాప్‌లో నిలిచింది.
Biryani Orders | బిర్యానీ అగ్రస్థానంలో..
బిర్యానీ తర్వాత భారతీయులు (Indians) అత్యధికంగా ఇష్టపడిన ఫుడ్ ఐటమ్‌గా బర్గర్ రెండో స్థానాన్ని దక్కించుకుంది. 2025లో స్విగ్గీ ద్వారా మొత్తం 4.42 కోట్ల బర్గర్ ఆర్డర్లు నమోదయ్యాయి. స్నాక్స్ విభాగంలో వెజ్ బర్గర్లు, చికెన్ బర్గర్లు మధ్య గట్టి పోటీ కనిపించింది. మూడో స్థానంలో పిజ్జా నిలిచింది. ఈ ఏడాది సుమారు 4.01 కోట్ల పిజ్జా ఆర్డర్లు వచ్చాయని రిపోర్ట్ వెల్లడించింది. నాలుగో స్థానంలో సౌత్ ఇండియన్ ఫేవరెట్ అయిన వెజ్ దోశ నిలవగా, దీన్ని 2.62 కోట్ల మంది ఆర్డర్ చేశారు. అల్పాహారాల విభాగంలో ఇడ్లీ 1.1 కోట్ల ఆర్డర్లతో మొదటి స్థానంలో నిలవగా, మసాలా దోశ రెండో స్థానాన్ని దక్కించుకుంది.
ఆర్డర్ల టైమింగ్ విషయంలో కూడా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల మధ్య చికెన్ బర్గర్లు, బిర్యానీలకు అత్యధిక డిమాండ్ కనిపించింది. బిర్యానీ ఆర్డర్లలో హైదరాబాద్ (Hyderabad) దేశవ్యాప్తంగా అగ్రస్థానంలో నిలవగా, బెంగళూరు, ముంబై తదుపరి స్థానాల్లో ఉన్నాయి. ఇక ముంబైకి చెందిన ఓ కస్టమర్ ఏడాదిలో ఏకంగా 3,196 సార్లు ఫుడ్ ఆర్డర్ చేసి రికార్డు సృష్టించారు. అంటే రోజుకు సగటున తొమ్మిది ఆర్డర్లు చేసినట్టుగా స్విగ్గీ తెలిపింది. స్వీట్స్ విభాగంలో గులాబ్ జామున్, చాక్లెట్ కేకులు టాప్‌లో నిలిచాయి.