అక్షరటుడే, వెబ్‌డెస్క్ : New Year Celebrations | మరి కొద్ది గంటలలో నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు యావత్ ప్రపంచం సిద్ధమవుతోంది. డిసెంబర్ 31 అర్ధరాత్రి కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ యువత భారీగా సెలబ్రేషన్స్‌కు సిద్ధమవుతుంది.
న్యూఇయర్ పార్టీ అంటే మందు, చిందు అనేది కామన్ అయిపోయింది. రాత్రంతా ఎంజాయ్ చేయడం వరకు బాగానే ఉన్నా, మరుసటి రోజు మాత్రం చాలా మంది హ్యాంగోవర్ సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. తలనొప్పి, వికారం, అలసట, డీహైడ్రేషన్ వంటి సమస్యలు వేధిస్తుంటాయి. అయితే ఈ హ్యాంగోవర్ సమస్య (Hangover Problem) నుంచి త్వరగా బయటపడేందుకు కొన్ని ఈజీ, సహజ చిట్కాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి పాటిస్తే కేవలం 10 నిమిషాల్లోనే ఉపశమనం లభిస్తుందని అంటున్నారు.
New Year Celebrations | ఈ చిట్కాలు పాటించండి..
హ్యాంగోవర్ నుంచి బయటపడేందుకు పసుపు నీళ్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. పసుపులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు నొప్పి, వాపు తగ్గించడంలో సహాయపడతాయి. ఒక టీస్పూన్ పసుపు, ఒక నిమ్మకాయ రసం గోరువెచ్చని నీటిలో కలిపి తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఇందులో కొద్దిగా నల్లమిరియాల పొడి, తేనె కలిపితే ప్రభావం మరింత పెరుగుతుంది. అలాగే కొబ్బరి నీళ్లు (Coconut Water) హ్యాంగోవర్‌కు బెస్ట్ డ్రింక్‌గా పనిచేస్తాయి. ఆల్కహాల్ వల్ల శరీరం డీహైడ్రేట్ అవుతుంది. కొబ్బరి నీళ్లలో ఉండే ఎలక్ట్రోలైట్స్ శరీరానికి తక్షణ శక్తిని అందించి నీటి లోపాన్ని భర్తీ చేస్తాయి. నిమ్మకాయ నీరు కూడా హ్యాంగోవర్ సమస్యకు చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఒక గ్లాసు నీటిలో నిమ్మరసం, చిటికెడు ఉప్పు కలిపి తాగితే శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ అవుతాయి. వికారం, వాంతులు, తలనొప్పి తగ్గి శరీరం హైడ్రేట్ అవుతుంది.
పెరుగు, మజ్జిగ తీసుకోవడం వల్ల కూడా మంచి ఉపశమనం లభిస్తుంది. చక్కెర లేదా ఉప్పు కలపకుండా సాదా పెరుగు లేదా మజ్జిగ తాగితే జీర్ణక్రియ మెరుగుపడి కడుపు సమస్యలు తగ్గుతాయి. అరటిపండ్లు హ్యాంగోవర్ సమయంలో చాలా ఉపయోగపడతాయి. వీటిలో ఉండే పొటాషియం, కార్బోహైడ్రేట్స్ శరీరానికి తక్షణ శక్తిని అందించి డీహైడ్రేషన్ (Dehydration)ను తగ్గిస్తాయి. అలాగే పుదీనా నీరు కూడా హ్యాంగోవర్‌కు చక్కటి పరిష్కారంగా పనిచేస్తుంది. తాజా పుదీనా ఆకులను నీటిలో మరిగించి వడకట్టి తాగితే వికారం, వాంతులు తగ్గడంతో పాటు జీర్ణక్రియ మెరుగవుతుంది. గ్రీన్ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని డిటాక్స్ చేసి త్వరగా కోలుకునేలా చేస్తాయి.
ఇక హ్యాంగోవర్ సమయంలో శరీరంలో ఎలక్ట్రోలైట్స్ (Electrolytes) తీవ్రంగా తగ్గిపోతాయి. ఈ లోటును భర్తీ చేయడానికి తేలికపాటి వెజిటేబుల్ సూప్ లేదా చికెన్ సూప్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి సులభంగా జీర్ణమవడమే కాకుండా శరీరానికి అవసరమైన ఖనిజాలు, శక్తిని అందిస్తాయి.