అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Delhi | దేశవ్యాప్తంగా చలితీవ్రత కొనసాగుతోంది. తెల్లవారుజామున దట్టంగా పొగమంచు కురుస్తోంది. దీంతో రోడ్లపై వాహనాలు కనిపించడం లేదు. ఫలితంగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
ప్రస్తుతం చలితీవ్రతతో పాటు పొగమంచు కురుస్తోంది. అయితే ఢిల్లీలో వాయు కాలుష్యం (Air Pollution) కారణంగా.. విజిబిలిటి మరింత క్షీణించింది. ఫలితంగా రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. తాజాగా శనివారం తెల్లవారుజామున నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై పొగమంచు కమ్ముకోవడంతో పదుల సంఖ్యలో వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో పలువురు వాహనదారులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు ట్రాఫిక్ (Police Traffic)ను క్రమబద్దీకరించారు.
Delhi | ఆంక్షలు కఠినతరం
ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగింది. దీంతో అధికారులు ఆంక్షలు మరింత కఠినతరం చేశారు. ఇందులో భాగంగా అనవసర నిర్మాణాలు, కూల్చివేత కార్యకలాపాలపై నిషేధం విధించారు. ఢిల్లీ, గురుగ్రామ్, ఘజియాబాద్, ఫరీదాబాద్, నోయిడా మొదలైన ప్రాంతాల్లో రవాణా వాహనాలపై ఆంక్షలు అమలు చేస్తున్నారు. ముఖ్యమైన వస్తువులను రవాణా చేసే వాహనాలు మినహా ఢిల్లీ బయట రిజిస్టర్ అయిన అన్ని పెట్రోల్, డీజిల్ వాహనాల (Diesel Vehicles)పై నిషేధం విధించారు.
Delhi | చలికాలంలో జాగ్రత్త..
చలికాలంలో ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా తెల్లవారుజామున పొగమంచు కారణంగా వాహనాలు కనిపించవు. ముందు వెళ్తున్న వారు సడన్ బ్రేక్ వేస్తే వాహనాలు ఒకదానిని ఒకటి ఢీకొనే ప్రమాదం అధికంగా ఉంటుంది. దీంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరం అయితేనే తెల్లవారుజామున ప్రయాణాలు చేయాలి. అతివేగంగా వెళ్లొద్దు. లైట్లు, ఇండికేటర్లు సరిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి.