Bathukamma Festival
Bathukamma Festival | పూల సింగిడి.. ఆటపాటల సందడి.. బతుకమ్మ పండుగ విశిష్టత ఇదే!

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bathukamma Festival | దేవుళ్లకు పూలను సమర్పించి పూజించడం సర్వసాధారణం. కానీ ఆ పూలనే దేవతలుగా మార్చి పూజించడం తెలంగాణ ప్రత్యేకం. అదే బతుకమ్మ పండుగ విశిష్టత.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేసే ఈ పండుగలో పూలు, ఆట, పాటలు ప్రత్యేకంగా నిలుస్తాయి.

మహిళలు తొమ్మిది రోజులపాటు రకరకాల పూలతో బతుకమ్మలను పేర్చి, వాటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ, ఆటలాడుతూ చేసుకునే పండుగిది. ప్రకృతిని ఆరాధించే ఈ పండుగ.. మహిళా శక్తిని గౌరవించే వేడుకగానూ నిలుస్తోంది.

బతుకమ్మ తయారీలో ఉపయోగించే పూలు..

తంగేడు(Thangedu), గునుగు(Gunugu), గులాబీ, చామంతి, నందివర్ధనం, గన్నేరు, గడ్డిపూలు, పట్టుకుచ్చుపూలు, బంతిపూలు వంటి వివిధ రకాల పూలను ఉపయోగిస్తారు. వాటిని వరుసలుగా దేవాలయ గోపురం ఆకారంలో పేర్చుతారు. చివరగా పేర్చిన బతుకమ్మ(Bathukamma) మధ్యలో గౌరమ్మను ఉంచుతారు.

Bathukamma Festival | పాటలు..

బతుకమ్మలను పేర్చిన తర్వాత మొదట ఇంట్లో.. ఆ తర్వాత వీధిలో లేదా గుడి వద్ద ఒక్కచోట చేర్చి మహిళలు వాటి చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ పాటలు పాడతారు. కష్ట సుఖాలను పాటల రూపంలో అమ్మవారికి విన్నవించుకుంటారు. కొందరు కోలాటం కూడా ఆడతారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. ఏమిమి పువ్వోప్పునే గౌరమ్మ.. చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ.. రామ రామ ఉయ్యాలో, రామనే శ్రీరామ ఉయ్యాలో.. ఒక్కేసి పువ్వేసి చందమామ రాశి కలుపుదాం రావె చందమామ.. శ్రీలక్ష్మి నీ మహిమలూ గౌరమ్మ చిత్రమై తోచునమ్మా గౌరమ్మ.. కలవారి కోడలు ఉయ్యాలో కనక మహాలక్ష్మి ఉయ్యాలో.. అంటూ రాగయుక్తంగా సాగే పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలనే కాకుండా ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, చరిత్ర, పురాణాలను మేళవిస్తారు. ఈ పాటలు శ్రావ్యంగా ఉంటాయి.