HomeతెలంగాణSriram sagar | శ్రీరాంసాగర్​కు పోటెత్తిన వరద.. 39 గేట్ల ఎత్తివేత

Sriram sagar | శ్రీరాంసాగర్​కు పోటెత్తిన వరద.. 39 గేట్ల ఎత్తివేత

- Advertisement -

అక్షరటుడే, ఆర్మూర్ : Sriram sagar | ఉమ్మడి నిజామాబాద్​, మెదక్​ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలోని పోచారం, నిజాంసాగర్​కు భారీ వరద వస్తుండడంతో మంజీరలోకి నీటిని విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటెత్తుతోంది. దీంతో ప్రాజెక్టు 39 వరద గేట్లు ఎత్తివేసి మూడు లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరి నదిలోకి విడుదల చేస్తున్నట్లు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కొత్త రవి తెలిపారు.

Sriram sagar | 69.064 టీఎంసీలకు చేరిన నీటిమట్టం..

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. మహారాష్ట్ర, నిజామాబాద్ నిర్మల్ జిల్లాల్లో భారీగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి రెండు లక్ష ల క్యూసెక్కుల ఇన్​ఫ్లో వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (80.5 టీఎంసీలు) కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 1087.50 అడుగుల (68.064టీ ఎంసీలు) నీరు నిల్వ ఉంది.

Sriram sagar | కాల్వల ద్వారా నీటి విడుదల

ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతుండడంతో 39 వరద గేట్లు ఎత్తి మూడు లక్షల వెయ్యి క్యూసెక్కులు నదిలోకి విడుదల చేస్తున్నారు. ఇక ఎస్కేప్ గేట్ల ద్వారా 8వేల క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 20వేల క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 400 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు వదులుతున్నాయి. 636 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో పోతుంది. మొత్తం 3.30 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. కాకతీయ, లక్ష్మి కాల్వలతో పాటు అలీసాగర్, గుత్ప ఎత్తిపోతలకు నీటి విడుదలను నిలిపి వేశారు.

Sriram sagar | ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

శ్రీరాంసాగర్​ ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తుండడంతో దిగువన గోదావరి నది పరిసర ప్రాంతాల్లోని ప్రజల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పశువుల కాపరులు, చేపలు పట్టేవారు, రైతులు, ప్రజలు గోదావరి నది వైపు వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు.