అక్షరటుడే, వెబ్డెస్క్ : Cyclone Montha | ఉమ్మడి నల్లగొండ జిల్లా (Nallagonda District)లో భారీ వర్షం దంచికొడుతోంది. వరదలు పోటెత్తి దేవరకొండ మండలం కొమ్మేపల్లి గ్రామంలొని గురుకుల పాఠశాలను చుట్టూముట్టింది. దీంతో ఆందోళన నెలకొంది. అధికార యంత్రాంగం హుటాహుటిన స్పందించి విద్యార్థులను రక్షించారు.
పోలీసులు తాళ్ల సాయంతో పిల్లలను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మొంథా తుఫాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. నల్లగొండ జిల్లాలోనూ వానలు దంచికొట్టాయి. దీంతో వాగులు, వంకలు ఉప్పొంగాయి. ఈ క్రమంలో దేవరకొండ మండలం కొమ్మేపల్లి గ్రామం (Kommepally Village)లొని గురుకుల పాఠశాలను చుట్టూ వరద చేరింది.
Cyclone Montha | తాళ్ల సాయంతో తరలింపు
పాఠశాలలో 500 మంది విద్యార్థులు చదువుకుంటటున్నారు. వారంతా వరదలో చిక్కుకుపోయారు. గురుకుల పాఠశాల (Gurukul School)ను ఆనుకుని భారీ వరద ప్రవహించింది. సమాచారమందుకున్న యంత్రాంగం హుటాహుటిన స్పందించింది. కలెక్టర్ ఇలా త్రిపాఠి అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని పోలీసులను ఆదేశించారు. పోలీసులు తాళ్ల సాయంతో పాఠశాలకు చేరుకుని, విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Cyclone Montha | అతలాకుతలమైన లోతట్టు ప్రాంతాలు..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భారీ వర్షాలతో జన జీవనం స్తంభించింది. కొండమల్లేపల్లిలోని దేవరకొండ- నల్గొండ రోడ్ పై భారీగా ప్రవహిస్తున్న వరద నీరు (Flood Water) ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పోచంపల్లి మండలం జూలూరు – రుద్రవెల్లి గ్రామాల వద్ద మూసి ఉధృతంగా ప్రవహించడంతో లో లెవెల్ పై నుండి మూసి నది ప్రవహించడంతో పోచంపల్లి – బీబీనగర్ మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. మూసి ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుండి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. మూసి ప్రాజెక్ట్ పూర్తిగా నిండి ఉండడంతో బుధవారం మూసి ప్రాజెక్టు గేట్లను ఎత్తి 20,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

