Homeతాజావార్తలుWarangal Floods | వరంగల్​ను వీడని వరద.. జలదిగ్బంధంలో పలు కాలనీలు

Warangal Floods | వరంగల్​ను వీడని వరద.. జలదిగ్బంధంలో పలు కాలనీలు

మొంథా తుపాన్​ ధాటికి వరంగల్​ అతలాకుతలం అయింది. వర్షాలు తగ్గుముఖం పట్టినా.. నగరాన్ని వరద వీడటం లేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Warangal Floods | మొంథా తుపాన్​ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కుండపోత వాన కురిసింది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్​ (Warangal) జిల్లాలో భారీ వర్షాలు పడ్డాయి. వరంగల్​, హన్మకొండల్లో రికార్డు స్థాయిలో వర్షం పడటంతో వరద ముంచెత్తింది.

మొంథా తుఫాన్ (Cyclone Montha) ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలం అయింది. ముఖ్యంగా వరంగల్​ నగరంలో వరదలు ముంచెత్తాయి. బుధవారం రాత్రి వరకు వర్షం తగ్గినా.. నగరాన్ని వరద వీడటం లేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్​, హన్మకొండ, కాజీపేట ప్రాంతాలు నీట మునిగాయి. హంటర్‌ రోడ్డులో బొంది వాగు తీవ్ర ఉధృతితో ప్రవహిస్తోంది. ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తుండగా.. 45 కాలనీలు నీట మునిగాయి.

వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భద్రకాళి ఆలయం (Bhadrakali Temple) నుంచి పాలిటెక్నిక్‌ కాలేజీ దాకా రోడ్డుపై నీరు నిలిచిపోయింది. దీంతో ఆలయం వైపు మార్గాన్ని మూసేశారు. సమ్మయ్య నగర్​ను వరద చుట్టు ముట్టడంతో 4 వేల మంది చిక్కుకుపోయారు. ఇళ్లపైకి ఎక్కి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. పలు కాలనీల్లో కార్లు, బైక్​లు వరదలో కొట్టుకుపోయాయి. ముంపు ప్రాంతాల ప్రజల కోసం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Warangal Floods | మంత్రి కొండా సురేఖ పర్యటన

మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) పలు కాలనీలలో పర్యటించారు. వరదల్లో చాలా మంది చిక్కుకుపోయారని ఆమె చెప్పారు. పలువురు ఇళ్లను వదలి రావడానికి నిరాకరిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. అధికారులు, ఎన్డీఆర్​ఎఫ్​ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయని వివరించారు. పాఠశాలలు, ఫంక్షన్ హాళ్లలో తాత్కాలిక ఆశ్రయాలను ఏర్పాటు చేశామన్నారు. ఆహార పంపిణీ కోసం పడవలు, డ్రోన్‌లతో సహా రెస్క్యూ బృందాలను ప్రభావిత ప్రాంతాలకు మోహరిస్తున్నట్లు తెలిపారు.

Warangal Floods | హన్మకొండకు సీఎం

హన్మకొండలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) పర్యటించనున్నారు. ప్రజలకు ఇబ్బందులు కల్గకుండా చర్యలు చేపట్టాలని ఇప్పటికే ఆయన అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై ముఖ్యమంత్రి ఆరా తీశారు.