HomeతెలంగాణSriram Sagar | శ్రీరామ్​సాగర్​కు పెరిగిన వరద.. 22 గేట్లు ఎత్తిన అధికారులు

Sriram Sagar | శ్రీరామ్​సాగర్​కు పెరిగిన వరద.. 22 గేట్లు ఎత్తిన అధికారులు

- Advertisement -

అక్షరటుడే, బాల్కొండ : Sriram Sagar | ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని శ్రీరామ్​సాగర్​ ప్రాజెక్ట్​(SRSP)కు ఎగువ నుంచి వరద పెరిగింది. దీంతో అధికారులు 22 గేట్లు ఎత్తి గోదావరిలోకి నీటిని విడుదల చేస్తున్నారు.

స్థానికంగా కురిసిన వర్షాలతో జలాశయంలోకి ఇన్​ఫ్లో కొనసాగుతోంది. నిజాంసాగర్ (Nizam Sagar)​ గేట్లు ఎత్తడంతో ఆ నీరు ఎస్సారెస్పీలోకి చేరుతోంది. దీంతో జలాశయంలోకి ప్రస్తుతం 82,395 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోంది.

Sriram Sagar | నిండుకుండలా జలాశయం

ఎగువ నుంచి వరద కొనసాగుతుండటంతో శ్రీరామ్​ సాగర్​ ప్రాజెక్ట్​ నిండుకుండలా మారింది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 1091 (80.5 టీఎంసీలు) అడుగులు కాగా.. అంతే మొత్తం నీటితో కళకళలాడుతోంది. వరద పెరగడంతో అధికారులు శుక్రవారం రాత్రి నుంచి 22 గేట్ల ద్వారా నీటిని వదులుతున్నారు.

Sriram Sagar | నీటి విడుదల వివరాలు

ప్రాజెక్ట్​లోకి ఎగువ నుంచి ఇన్​ఫ్లో కొనసాగుతుండటంతో 22 గేట్ల (Flood Gates) ద్వారా 64,680 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఎస్కేప్​ గేట్ల ద్వారా 8 వేల క్యూసెక్కులు, వరద కాలువకు 8 వేలు, సరస్వతి కాలువ ద్వారా 800, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు వదులుతున్నారు. ఆవిరి రూపంలో 684 క్యూసెక్కులు పోతోంది. దీంతో మొత్తం ఔట్​ ఫ్లో 82,395 క్యూసెక్కులుగా ఉంది.

ఇన్​ఫ్లో, ఔట్​ఫ్లో సమానంగా ఉండటంతో ప్రాజెక్ట్​ నీటిమట్టం నిలకడగా ఉంది. వర్షాలు పడుతుండటంతో కాకతీయ కాలువ, లక్ష్మి కాలువ, అలీసాగర్, గుత్ప ఎత్తిపోతలలకు నీటి విడుదలను అధికారులు నిలిపివేశారు. వరద గేట్లు, కాలువల ద్వారా నీటి విడుదల కొనసాగుతుండటంతో పరీవాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.