అక్షరటుడే, ఆర్మూర్ : SRSP | శ్రీరామ్ సాగర్ (Sriram Sagar) ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద వస్తోంది. దీంతో అధికారులు నీటి విడుదలను పెంచారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ 39 వరద గేట్ల ద్వారా 5.96 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.
ప్రాజెక్ట్‌కు ఎగువ నుంచి ప్రస్తుతం 4.90 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. మహారాష్ట్రతో పాటు స్థానికంగా కురిసిన వర్షాలతో గోదావరి (Godavari) ఉధృతంగా పారుతోంది. మరోవైపు మంజీరకు వరద పోటెత్తడంతో నిజాంసాగర్ నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. దీంతో ఎస్సారెస్పీకి భారీగా వరద వస్తుంది. వరదతో ప్రాజెక్ట్‌కు ఇబ్బందులు లేకుండా అధికారులు దిగువకు నీటి విడుదలను పెంచారు.
SRSP | తగ్గుతున్న నీటిమట్టం
ఎస్సారెస్పీ ఇన్‌ఫ్లో కంటే ఔట్‌ఫ్లో ఎక్కువగా ఉండటంతో ప్రాజెక్ట్ నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. మొన్నటి వరకు జలాశయంలో పూర్తిస్థాయిలో నీటిని నిల్వ ఉంచిన అధికారులు వదరల దృష్ట్యా నీటి మట్టాన్ని తగ్గించారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు (1091 అడుగులు ) కాగా ప్రస్తుతం 58.97 టీఎంసీల (1084.70 అడుగులు) నీరు నిల్వ ఉంది.
SRSP | కాలువల ద్వారా..
శ్రీరామ్‌సాగర్ నుంచి ఎస్కేప్ గేట్ల ద్వారా 8 వేల క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 12,300, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు వదులుతున్నారు. వర్షాలు పడుతుండటంతో ఆయకట్టుకు నీటి విడుదల నిలిపివేశారు. గోదావరిలోకి భారీగా నీటిని విడుదల చేస్తుండటంతో నది పరీవాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్ట్ ఏఈఈ కొత్తరవి సూచించారు.
SRSP | నీట మునిగిన పొలాలు
శ్రీరామ్‌సాగర్ నుంచి 5.9 లక్షల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. దీంతో దిగువన గోదావరి ఉధృతంగా పారుతోంది. నది సమీపంలోని పొలాలను వరద ముంచెత్తింది. దూదిగాం శివారులో పంటలు నీట మునగడంతో రైతులు (Farmers) ఆందోళన చెందుతున్నారు.

SRSP | బాసర వద్ద గోదావరి ఉగ్రరూపం
శ్రీరామ్‌సాగర్ ఎగువన బాసర (Basara) వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. గోదావరి పుష్కర ఘాట్లతో పాటు, రోడ్డుపై వరకు వరద నీరు వచ్చి చేరింది. వరద మరింత పెరిగితే అమ్మవారి ఆలయం ముందు వరకు వరద చేరే అవకాశం ఉంది.