HomeతెలంగాణMusi River | ముంచెత్తిన మూసీ.. జలదిగ్బంధంలో నగరం

Musi River | ముంచెత్తిన మూసీ.. జలదిగ్బంధంలో నగరం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Musi River | నగరాన్ని మూసీ నది ముంచెత్తింది. రంగారెడ్డి, వికారాబాద్​ జిల్లాలో భారీ వర్షం పడటంతో మూసీ నది(Musi River)కి భారీగా వరద పోటెత్తింది.

మూసీ వరద ఉధృతికి చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ముఖ్యంగా ఓల్డ్​ సిటీలోని పలు ప్రాంతాలను వరద ముంచెత్తింది. నది పరీవాహక ప్రాంతాల్లోని ఇళ్లలలోకి వరద నీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలతో(Heavy Rains) హిమాయత్​ సాగర్​, ఉస్మాన్​ సాగర్​(గండిపేట)కు భారీగా వరద(Heavy Flood) వస్తోంది. దీంతో అధికారులు గేట్లు ఎత్తి మూసీలోకి నీటిని విడుదల చేస్తున్నారు. హిమాయత్​ సాగర్​ నుంచి భారీగా నీటిని వదులుతుండటంతో నార్సింగి వద్ద ఓఆర్​ఆర్​ సర్వీస్​ రోడ్డు మీదుగా వరద ప్రవహిస్తోంది. దీంతో అధికారులు ఆ మార్గంలో రాకపోకలను మూసి వేశారు.

Musi River | ఎంజీబీఎస్​లోకి వరద

నగరంలోని ప్రధాన బస్టాండ్​ ఎంజీబీఎస్​ను మూసీ ముంచెత్తింది. శుక్రవారం అర్ధరాత్రి ఒక్కసారిగా బస్టాండ్​లోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అధికారులు స్పందించి వారిని తాళ్ల సాయంతో బయటకు తీసుకు వచ్చారు. ఆర్టీసీ అధికారులు ఎంజీబీఎస్​ నుంచి బస్సుల రాకపోకలను నిలిపి వేశారు. జేబీఎస్​, ఆరాంఘర్​, ఎల్బీ నగర్​, ఉప్పల్​ క్రాస్​ రోడ్డు నుంచి అటువైపు ఉన్న జిల్లాలకు బస్సులను నడిపిస్తున్నారు.

Musi River | ప్రమాదకరంగా ప్రవాహం

ముసారాంబాగ్‌ వద్ద మూసీ ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. వంతెన పై నుంచి 10 అడుగుల మేర వరద పారుతోంది. ప్రస్తుతం అక్కడ నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిని తాకుతూ వరద పారుతోంది. నీటి ఉధృతికి బ్రిడ్జికి సంబంధించిన నిర్మాణ సామగ్రి కొట్టుకుపోయింది. పురానాపూల్ శివాలయం ఘాట్‌ నీట మునిగింది. చాదర్​ఘాట్​, పురానాపూల్​ ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగాయి. వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. నది పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Musi River | చర్యలు చేపడుతున్నాం

మూసీ వరదలపై హైదరాబాద్ ఇన్​ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar)​ స్పందించారు. వర్షాలు, వరదలతో ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. కాగా మూసీ పరీవాహక ప్రాంతాల్లో నివసిస్తున్న దాదాపు వెయ్యి మందిని అధికారులు ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించారు.

Musi River | ప్రభుత్వం ఆదుకోవాలి

చాదర్​ఘాట్​లో ఇళ్లు మునిగిన ప్రజలు మాట్లాడుతూ.. అధికారులు వరదలపై తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని వాపోయారు. ఇంట్లోని సామగ్రి, వస్తువులు నీటి మునిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. పోలీసులు చాదర్‌ఘాట్ వంతెన దగ్గర ప్రధాన రహదారిని మూసివేశారు. దీంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్​ జామ్(Traffic Jam)​ అయింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్​ఎఫ్​, హైడ్రా, జీహెచ్​ఎంసీ సిబ్బంది మోహరించారు.

Must Read
Related News