Sriram Sagar
Sriram Sagar | శ్రీరామ్​సాగర్​లోకి పోటెత్తిన వరద.. 38 గేట్లు ఓపెన్​

అక్షరటుడే, మెండోరా : Sriram Sagar |ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ (Sriram Sagar Project)కు ఎగువ నుంచి వరద పోటెత్తింది. దీంతో అధికారులు 38 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

జలాశయంలోకి ప్రస్తుతం 2,81,475 క్యూసెక్కుల వరద వస్తోంది. ఎగువన మహారాష్ట్ర (Maharashtra), స్థానికంగా కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉధృతంగా పారుతోంది. బుధవారంతో పోలిస్తే వరద పెరగడంతో అధికారులు నీటి విడుదలను పెంచారు. ఇన్​ఫ్లో కంటే ఔట్​ ఫ్లో (Out Flow) అధికంగా ఉండేలా చర్యలు చేపట్టారు.

Sriram Sagar |నీటి విడుదల వివరాలు

శ్రీరామ్​సాగర్​ నుంచి 38 గేట్ల ద్వారా 2,93,747 క్యూసెక్కులు వదులుతున్నారు. ఎస్కేప్ గేట్ల ద్వారా 4 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. వరద కాలువకు 6,735, కాకతీయ కాలువకు 4 వేలు, సరస్వతి కాలువకు 400, లక్ష్మి కాలువకు 200 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మిడ్ మానేరు (Mid Manair), లోయర్ మానేరు డ్యాం (LMD)లు నిండటంతో వరద కాలువ ద్వారా నీటి విడుదలను అధికారులు తగ్గించారు. మిషన్ భగీరథకు (Mission Bhagiratha) 231 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 701 క్యూసెక్కుల నీరు పోతోంది.

Sriram Sagar | తగ్గుతున్న నీటిమట్టం

ప్రాజెక్టు వరద పోటెత్తడంతో అధికారులు నీటి విడుదలను భారీగా పెంచారు. దీంతో జలాశయం నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం జలాశయంలోకి 2,81,475 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తుండగా.. 3,10,014 క్యూసెక్కుల ఔట్​ ఫ్లో నమోదు అవుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 1091 (80.5 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 1087.0 (66.508 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ (water storage) ఉంది. గోదావరిలోకి భారీగా నీటిని వదులుతుండటంతో పరీవాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.