అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy Floods | జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు (Heavy Rains) తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. కామారెడ్డిలోని జీఆర్ కాలనీతో పాటు పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి.
వరదల్లో కొట్టుకుపోయి పలువురు మృతి చెందారు. అయితే వారి మృతదేహాలు ఒక్కొక్కటిగా లభ్యం అవుతున్నాయి. ఆగస్టు 30న రాత్రి జీఆర్ కాలనీ (GR Colony)లో చిన్నమల్లారెడ్డి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. శనివారం మరో మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పట్టణ శివారులో పొదల్లో కుళ్లిన స్థితిలో మృతదేహం ఉంది. దీంతో మృతుడి వివరాలు తెలియరాలేదు.
వరదలు వచ్చిన సమయంలో కాలనీలో నివాసం ఉండే మాజీ న్యాయవాది ఒకరు కారులో కొట్టుకుపోయినట్టుగా ప్రచారం జరిగింది. గత నెల 30న దొరికిన మృతదేహం కూడా అతనిదేనంటూ ప్రచారం సాగింది. అయితే మృతుడి జేబులో ఓటర్ ఐడీ కార్డు లభించడంతో చిన్నమల్లారెడ్డికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ప్రస్తుతం లభించిన మృతదేహం న్యాయవాదిదని ప్రచారం సాగుతోంది. వరదలు వచ్చినప్పటి నుంచి సదరు న్యాయవాది ఆచూకీ లభించలేదు. ఈ విషయమై పట్టణ సీఐ నరహరి (Town CI Narahari)ని వివరణ కోరగా ఆ మృతదేహం ఎవరిది అనేది స్పష్టంగా తెలియదన్నారు.