అక్షరటుడే, వెబ్‌డెస్క్: Mexico Floods | అగ్రరాజ్యం అమెరికా (America)లో వరదలు బీభత్సం సృష్టించాయి. ఇటీవల టెక్సాస్‌లో భారీ వర్షాలు (Texas Rains) కురిసిన విషయం తెలిసిందే. టెక్సాస్‌ను వరద ముంచెత్తడంతో 110 మంది మరణించగా, 173 మంది వరకు గల్లంతయ్యారు. తాజాగా మెక్సికో(Mexico)లో వర్షం బీభత్సం సృష్టించింది. మంగళవారం కురిసిన వర్షాలతో న్యూ మెక్సికోలో భారీ వరదలు ముంచెత్తాయి. వరద ఉధృతికి పర్వత గ్రామమైన రుయిడోసోలో ఓ ఇల్లు కొట్టుకుపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కాగా ఆ గ్రామంలో వరదలతో ముగ్గురు చనిపోయారు.
Mexico Floods | 20 అడుగుల ఎత్తులో ప్రవహిస్తున్న నది
ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. దీంతో గంట వ్యవధిలోనే రియో రుయిడోసో (Rio Ruidoso) నది నీటి మట్టం మూడు అడుగుల నుంచి 20.24 అడుగుల ఎత్తుకు పెరగడం గమనార్హం. ఇటీవల టెక్సాస్‌లో సైతం నిమిషాల వ్యవధిలోనే రోడ్డు కనిపించకుండా వరద ముంచెత్తిన విషయం తెలిసిందే. వరదల నేపథ్యంలో సహాయక బృందాలు అప్రమత్తం అయ్యాయి. ముంపునకు గురైన గ్రామాల్లో సహాయక చర్యలు ప్రారంభించాయి. ఇప్పటికే చాలా మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు.
Mexico Floods | ఎటు చూసిన బురదే..
వరద తీవ్రత తగ్గిన తర్వాత అధికారులు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఎక్కడ చూసిన బురద ఉండటంతో వారికి ఇబ్బంది అవుతోంది. కొన్ని కార్లు బురదలో చిక్కుకున్నాయి. వరదల్లో ఇళ్లు కోల్పోయిన వారి కోసం అధికారులు శిబిరాలు ఏర్పాటు చేశారు. వరద ఉధృతికి అనేక చెట్లు కొట్టుకుపోయాయని స్థానికులు తెలిపారు.