అక్షరటుడే, ఆర్మూర్ : Sriram Sagar | శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్‌కు ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. దీంతో 29 వరద గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
స్థానికంగా కురిసిన వర్షాలతో పాటు మహారాష్ట్ర నుంచి జలాశయంలోకి 1.50 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 (80.5 టీఎంసీలు) అడుగులు కాగా ప్రస్తుతం. 1090.0 (76.8 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువగా ఉండటంతో పాటు ఎగువ నుంచి వదర కొనసాగుతుండటంతో అధికారులు నీటి విడుదలను పెంచారు.
Sriram Sagar | కాలువల ద్వారా నీటి విడుదల
శ్రీరామ్ సాగర్‌లోకి భారీగా వరద(Heavy Flood) నీరు వచ్చి చేరుతుండడంతో 29 గేట్లు ఎత్తి గోదావరిలోకి 1.25 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఎస్కేప్ గట్ల ద్వారా 3,500, వరద కాలువకు 18 వేలు, కాకతీయ కాలువ(Kakatiya Canal)కు 4,500 క్యూసెక్కులు వదులుతున్నారు. మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు వదులుతుండగా.. 666 క్యూసెక్కులు ఆవిరి రూపంలో పోతుంది. మొత్తం 1,51,897 క్యూసెక్కుల ఔట్ ఫ్లో నమోదు అవుతోంది. ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో దాదాపు సమానంగా ఉండటంతో ప్రాజెక్ట్ నీటిమట్టం నిలకడగా ఉంది. కాగా సరస్వతి, లక్ష్మి కాలువతో పాటు అలీసాగర్, గుత్ప ఎత్తిపోతల పథకాలకు నీటి విడుదలను అధికారులు నిలిపి వేశారు.
Sriram Sagar | వరద పెరిగే అవకాశం
శ్రీరామ్ సాగర్(Sriram Sagar) ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువలో ఉంది. ఉమ్మడి నిర్మల్ జిల్లాలో సోమవారం భారీ వర్షం కురిసింది. రానున్న మూడు రోజులు నిర్మల్‌తో పాటు నిజామాబాద్ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉంది. దీంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్‌కు వరద పెరగొచ్చు. ఇన్‌ఫ్లో పెరిగితే గోదావరి ద్వారా నీటి విడుదల అధికారులు పెంచుతారు. ఈ క్రమలో నది సమీపంలోకి ప్రజలు వెళ్లొద్దని, ఎట్టి పరిస్థితుల్లో నది, కాలువల్లో చేపల వేట చేయొద్దని ప్రాజెక్ట్ ఏఈఈ కొత్త రవి సూచించారు.