Homeఅంతర్జాతీయంIndia - China | 5 ఏళ్ల త‌ర్వాత భారత్ - చైనా మధ్య మళ్లీ...

India – China | 5 ఏళ్ల త‌ర్వాత భారత్ – చైనా మధ్య మళ్లీ విమాన సర్వీసులు.. విదేశాంగశాఖ కీల‌క ప్రకటన

అక్షరటుడే, వెబ్​డెస్క్ : India – China | గల్వాన్ లోయలో 2020లో చోటుచేసుకున్న ఘర్షణల తర్వాత భారత్-చైనా సంబంధాలు దెబ్బ‌తిన్నాయి. అయితే ఇటీవల జరిగిన షాంఘై సహకార సంస్థ (Shanghai Cooperation Organization) శిఖరాగ్ర సమావేశంలో రెండు దేశాల మధ్య జరిగిన చర్చలలో కీలక మలుపు చోటు చేసుకుంది.

వీటికి కొనసాగింపుగా అక్టోబర్ 26 నుండి భారత్-చైనా మధ్య డైరెక్ట్(India – China) విమాన సర్వీసులు మళ్లీ ప్రారంభం కానున్నాయి. గ‌ల్వానా ఘటనల తర్వాత ప‌లు వేదికలపై పరస్పర ఆరోపణలు, విమాన సర్వీసుల రద్దు, వాణిజ్య పరిమితులు ఇలా అనేక మార్పులు చోటు చేసుకోవ‌డం మ‌నం చూశాం. కానీ, ఇటీవల ఎస్సీవో సమావేశం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ మరియు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భేటీ అయి సంబంధాల పునరుద్ధరణకు పునాది వేశారు.

India – China | 5 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ సర్వీసులు

ఈ నేపథ్యంలో భారత విదేశాంగశాఖ ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ, భారత్-చైనా మధ్య రాకపోకలు సాధారణ స్థితికి వచ్చే దిశగా విమాన సర్వీసులు పునఃప్రారంభం కావడం ఎంతో సానుకూల విషయం అని పేర్కొంది. రెండు దేశాల ఎయిర్‌లైన్లు ఇప్పటికే అక్టోబర్ 26 నుంచి విమాన షెడ్యూల్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రాథమికంగా ఢిల్లీ-బీజింగ్, ముంబయి-షాంఘై మార్గాల్లో సర్వీసులు ఉండే అవకాశం ఉంది. ఇటీవల చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత్‌ పర్యటనకు వచ్చారు. ఆ సందర్భంగా ప్రధాని మోదీ(PM Modi)తో సమావేశమయ్యారు. ఈ సమావేశాన్ని “పరస్పర గౌరవం, పరస్పర ప్రయోజనాలపై ఆధారపడి ఉన్న చర్చ”గా మోదీ పేర్కొన్నారు. “ఇది రెండు దేశాల మధ్య సంబంధాల్లో కొత్త అధ్యాయానికి నాంది” అని మోదీ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్టు చేశారు.

చివరిగా భారత్-చైనా మధ్య డైరెక్ట్ విమాన సర్వీసులు(Flight Services) 2019లో కోవిడ్ నేపథ్యంలో ఆగిపోయాయి. తర్వాత గల్వాన్ ఘటనలతో సంబంధాలు మరింత తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత, ఈ విమాన సేవలు పునఃప్రారంభం కావడం రెండు దేశాల మధ్య నెలకొంటున్న సామాన్య పరిస్థితులకు సూచకంగా పరిగణించవచ్చు. విమాన సర్వీసులు తిరిగి ప్రారంభం కావడం శుభ‌సూచ‌కం అని విశ్లేషకులు అంటున్నారు. వాణిజ్యం, విద్య, పర్యాటకం వంటి రంగాల్లో కూడా రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.