అక్షరటుడే, కామారెడ్డి: Flag March in Kamareddy | మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) అన్నారు. కామారెడ్డి పట్టణంలో సోమవారం శిశుమందిర్ స్కూల్ నుంచి న్యూ బస్టాండ్, నిజాంసాగర్ రోడ్, బడా మసీద్, పాంచ్ చౌరస్తా, డెయిలీ మార్కెట్, బాంబే క్లాత్ స్టోర్, రైల్వే స్టేషన్, సిరిసిల్ల రోడ్డు మీదుగా రాజీవ్ పార్క్ వరకు ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు.
Flag March in Kamareddy | ఎన్నికల వేళ మేమున్నామంటూ..
ఎన్నికల వేళ ప్రజల్లో మరింత భద్రతాభావం పెంపొందించడం, నమ్మకాన్ని కలిగించడం, పోలీస్ శాఖ పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉందనే సందేశాన్ని ఇవ్వడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు. ఎన్నికలు పూర్తిగా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించబడతాయని, ప్రజలు పోలీసు శాఖకు (Kamareddy Police) పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. ఎన్నికల నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం, పోలీసులకు అందించే సహకారం అత్యంత కీలకమని తెలిపారు.
గడువు ముగిసిన అనంతరం..
ప్రచార గడువు ముగిసిన తర్వాత అభ్యర్థులు, మద్దతుదారులు ఎవరైనా ప్రచారం నిర్వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, కీలక ప్రాంతాలు నిరంతరం సీసీ కెమెరాల (CCTV cameras) నిఘాలో ఉంటాయని, ప్రతి కదలికను కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు. అవాంఛనీయ ఘటన జరగకుండా ముందస్తుగా అన్ని భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశామని వెల్లడించారు. ఓటర్లు మద్యం, డబ్బు, బహుమతులు వంటి ఎలాంటి ప్రలోభాలకు గురికావద్దన్నారు. అటువంటి సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అసత్య ప్రచారాలు చేయవద్దని, శాంతియుత ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని విజ్ఞప్తి చేశారు.