అక్షరటుడే, భీమ్‌గల్: Limbadri Gutta | భీమ్‌గల్ లక్ష్మీనృసింహస్వామి (Lakshmi Narasimha Swamy) బ్రహ్మోత్సవాల్లో భాగంగా లింబాద్రి గుట్ట గోవింద నామస్మరణతో మార్మోగింది. భక్తిశ్రద్ధలతో బుధవారం ధ్వజారోహణం కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. స్వామివారి కల్యాణ మండలంలో గరుడ పఠంపై స్వామివారి ఉత్సవ మూర్తుల ఎదుట ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యజ్ఞ కార్యక్రమాన్ని చేపట్టారు.
Limbadri Gutta | పట్టువస్త్రంపై..
పట్టువస్త్రంపై హోమపూజ నిర్వహించి సప్తదశ కలశ స్థాపన, శోడసోపచారముల పద్ధతితో కలశంలోని జలంతో అభిషేకాలు నిర్వహించి అర్చకులు ప్రాణప్రతిష్ఠ నిర్వహించారు. చతుర్విదమైన అన్నాన్ని నైవేద్యంగా గరుడ్మంతుడికి ముద్దలుగా చేసి ధ్వజారోహణం అనంతరం వీటిని అందజేశారు.
ఈ సందర్భంగా మహిళల మంగళహారతుల మధ్య స్వామివారికి శాస్త్రోక్తంగా కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకొని ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా.. గురువారం కుష్మాండ నవమి, స్వామివారి ఎదుర్కోలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి తెలిపారు.

