అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Chirala Beach | ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల (Bapatla) జిల్లా చీరాలలో విషాదం చోటు చేసుకుంది. సముద్ర స్నానానికి వెళ్లిన ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. వారిలో ముగ్గురి మృతదేహాలు లభ్యం అయ్యాయి.
అమరావతిలోని విట్ యూనివర్సిటీ (VIT University)కి చెందిన పది మంది విద్యార్థులు ఆదివారం సరదాగా గడపడానికి బీచ్‌కు వచ్చారు. ఈ క్రమంలో సముద్రంలో స్నానం చేస్తుండగా ఎనిమిది మంది యువకులు అలల తాకిడికి కొట్టుకుపోయారు. గమనించిన స్థానికులు అందులో ముగ్గురిని కాపాడారు. ఐదుగురు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో హైదరాబాద్‌కు చెందిన శ్రీ సాకేత్, సాయి మణిదీప్, జీవన్ సాత్విక్ మృతదేహాలు లభ్యం అయ్యాయి. మరో విద్యార్థి సోమేశ్, చీరాలకు చెందిన గౌతమ్ ఆచూకీ లభ్యం కాలేదు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Chirala Beach | మచిలీపట్నంలో..
మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్ (Manginapudi Beach)లో ఇద్దరు కానిస్టేబుళ్లు ప్రాణాలకు తెగించి నలుగురు యువకులను రక్షించారు. కపిలేశ్వరానికి చెందిన అబ్దుల్ ఆసిఫ్, ఎస్‌కే ఆర్ఫాద్, ఎస్‌కే సికిందర్, షరీఫ్ ఆదివారం బీచ్‌కు వచ్చారు. సముద్రంలో స్నానం చేస్తుండగా.. అలల తాకిడికి వారు కొట్టుకుపోయారు. ఇది గమనించిన కానిస్టేబుళ్లు నాంచారయ్య, శేఖర్ నీళ్లలోకి దిగి వారిని రక్షించారు.