HomeజాతీయంBihar | నిద్ర‌పోతుండ‌గా కుప్ప‌కూలిన ఇంటి పైక‌ప్పు.. కుటుంబం మొత్తం దుర్మరణం

Bihar | నిద్ర‌పోతుండ‌గా కుప్ప‌కూలిన ఇంటి పైక‌ప్పు.. కుటుంబం మొత్తం దుర్మరణం

బీహార్ రాష్ట్రం పాట్నా జిల్లా దానాపూర్ ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి విషాదం చోటుచేసుకుంది. నిద్రలో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు పాత ఇంటి పైకప్పు కూలిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bihar | బీహార్ రాష్ట్రంలోని పాట్నా జిల్లా (Patna District) దానాపూర్ ప్రాంతంలో పెను విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు నిద్రిస్తుండగా పాత ఇంటి పైకప్పు కూలిపోవడంతో అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.

వివరాల్లోకి వెళితే.. దానాపూర్ (Danapur) పరిధిలోని ఓ గ్రామంలో నివసిస్తున్న ఓ పేద కుటుంబం ఆదివారం రాత్రి భోజనం చేసి పడుకుంది. ఆ సమయంలో పాతబడి, శిథిలావస్థకు చేరిన వారి ఇంటి పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. పైకప్పు కింద చిక్కుకుపోయిన కుటుంబ సభ్యులు ఊపిరాడక నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు.

Bihar | ఘోర ప్ర‌మాదం..

ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఇరుగుపొరుగు వారు పెద్ద శబ్దం విని ఘటనా స్థలానికి చేరుకున్నారు. శిథిలాల కింద కుటుంబ సభ్యులు చిక్కుకున్నట్లు గుర్తించి వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. అయినప్పటికీ, అప్పటికే ఆలస్యం కావడంతో, వారిని బయటకు తీసేలోపే ఐదుగురు మరణించినట్లు గుర్తించారు. మృతులను ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తలు, వారి ముగ్గురు పిల్లలుగా గుర్తించారు. వారి పేర్లు మంగళ్ మండల్ (45), అతని భార్య కవితా దేవి (40), వారి ముగ్గురు పిల్లలు సోనూ (15), మోనూ (12), ఓ చిన్నారి పాప అని తెలిసింది.

స్థానికులు వెంటనే పోలీసులకు  సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతదేహాలను శిథిలాల నుంచి వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. భారీ వర్షాలు (Heavy Rains) కురవడంతో లేదా ఇంటి నిర్మాణం పాతబడడం వల్లే ఈ దుర్ఘటన జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుటుంబంలో ఐదుగురు మరణించడంతో గ్రామంలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై ఉన్న‌తాధికారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, మృతుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికార వర్గాలు ప్రకటించాయి.

Must Read
Related News