అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ACB Raid | మరో అవినీతి అధికారి ఏసీబీకి చిక్కారు. మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలో సభ్యులను చేర్చడానికి లంచం అడిగిన జిల్లా మత్స్యశాఖ అధికారిణి (Fisheries officer), ఫీల్డ్ ఆఫీసర్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
అవినీతి అధికారులు ఏ మాత్రం మారడం లేదు. కార్యాలయాలకు పనుల నిమిత్తం వచ్చే వారిని డబ్బుల కోసం వేధిస్తున్నారు. ఏసీబీ దాడులు (ACB Raid) జరుగుతున్నా లంచాలకు మరిగిన అధికారులు మాత్రం భయపడటం లేదు. తాజాగా వరంగల్ (Warangal) జిల్లా మత్స్యశాఖ అధికారి అల్లు నాగమణి, ఔట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తున్న ఫీల్డ్ ఆఫీసర్ పెద్దబోయిన హరీశ్ లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ACB Raid | రూ.70 వేలు డిమాండ్
జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన మత్స్యకారులు మత్స్యపారిశ్రామిక సంఘంలో తమను చేర్చాలని జిల్లా అధికారిణి నాగమణిని కలిశారు. వారి నుంచి ఆమె రూ.70 వేలు లంచం డిమాండ్ చేశారు. భాదితులు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో బాధితుల నుంచి శుక్రవారం కార్యాలయంలో పని చేస్తున్న ఫీల్డ్ ఆఫీసర్ హరీశ్ ద్వారా అధికారిణి లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంలో సోదాలు చేపట్టారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
కాగా మత్స్యశాఖలో కొందరు అధికారులు భారీగా అవినీతికి పాల్పడుతున్నారు. చెరువుల్లో చేప పిల్లలను వదిలే సమయంలో డబ్బులు దండుకుంటున్నారు. అలాగే మత్స్య పారిశ్రామిక సంఘాల్లో సభ్యులను చేర్చడం, లైసెన్స్‌లు ఇవ్వడం కోసం భారీగా లంచాలు అడుగుతారనే ఆరోపణలు ఉన్నాయి. గత నెలలో నల్గొండ జిల్లా మత్స్యశాఖ అధికారిణి చరితారెడ్డి సైతం రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కింది.