అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Anakapalli | చేపల వేటకు వెళ్లిన యువకుడిని ఓ భారీ మీనం (huge fish) సముద్రంలోకి లాక్కెళ్లింది. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్లో (Andhra Pradesh) చోటు చేసుకుంది.
ఏపీలోని అనకాపల్లి జిల్లా (Anakapalle district) అచ్యుతాపురం మండలం పూడిమడకకు చెందిన కొందరు బుధవారం ఉదయం సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. వేటకు వెళ్లిన వారిలో చోడపల్లి యర్రయ్య(26) ఆయన తమ్ముడు కొర్లయ్య, వాసుపల్లి యల్లాజి, గనగళ్ల అప్పలరాజు ఉన్నారు. ఈ క్రమంలో భారీ చేపను పట్టుకునే యత్నంలో యర్రయ్య గల్లంతయ్యాడు.
Anakapalli | చూస్తుండగానే..
సముద్రంలో వేట సాగిస్తుండగా యర్రయ్యకు భారీ చేప చిక్కింది. సుమారు వంద కిలోల బరువుండే కొమ్ముకొనాం చేప (kommakonam fish) చిక్కడంతో యర్రయ్య సంబర పడ్డాడు. అయితే దానిని బోటులోకి లాగడానికి యర్రయ్య యత్నించారు.
ఈ క్రమంలో భారీ చేప యర్రయ్యను బలంగా నీటి లోపలికి లాక్కెళ్లిపోయింది. తమ కళ్లముందే యర్రయ్య నీటిలో గల్లంతు కావడంతో వేటకు వెళ్లిన వారు తీవ్రంగా విలపించారు. అనంతరం గ్రామస్తులకు సమాచారం అందించారు. గ్రామస్తులు, అధికారులు బుధవారం సాయంత్రం వరకు గాలించినా యర్రయ్య ఆచూకీ లభించలేదు. ఈ ఘటనతో పూడిమడక గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.