అక్షరటుడే, వెబ్డెస్క్ : Fireworks Blast | ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ (Konaseema) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. దీపావళీ పండుగ కోసం తెచ్చి నిల్వ చేసిన టపాకాయలు పేలి ఇద్దరు మృతి చెందారు.
మరో 20 రోజుల్లో దీపావళి (Diwali) పండుగ రానుంది. అక్టోబర్ 20న దేశవ్యాప్తంగా దీపావళీ వేడుకలను ఘనంగా నిర్వహించుకోనున్నారు. కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం విలస గ్రామంలో శ్రీనివాసరావు, సీత దంపతులు. వీరు కిరాణ దుకాణం నిర్వహిస్తూ జీవిస్తున్నారు. దీపావళి సమీపిస్తుండటంతో వీరు ముందుగానే టపాకాయలు తెచ్చి దుకాణంలో పెట్టుకున్నారు. మంగళవారం అవి ఒక్కసారిగా పేలాయి. ఈ ఘటనలో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. వారి కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు ఆయనను ఆస్పత్రికి తరలించారు.
Fireworks Blast | టపాసులతో జాగ్రత్త
దీపావళి పండుగ సందర్భంగా చాలా మంది ఉత్సాహంగా టపాకాయలు కాలుస్తారు. ముఖ్యంగా యువత పెద్ద పెద్ద పటాసులు కాల్చి ఎంజాయ్ చేస్తుంటారు. పట్టణ ప్రాంతాల్లో టపాకాయల దుకాణాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. గ్రామాల్లో మాత్రం కిరాణ దుకాణాల్లో వీటిని అమ్ముతారు. దీనికోసం ముందుగానే కొనుగోలు చేసి పెట్టుకుంటారు. ఇలాంటి సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ముఖ్యంగా టపాసులు నిల్వ చేసే గది ఇంటికి దూరంగా ఉండేలా చూసుకోవాలి. ఆ గదిలో షార్ట్ సర్క్యూట్ (Short Circuit) జరగకుండా చర్యలు చేపట్టాలి. అలాగే టపాసులు కాల్చే సమయంలో సైతం జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి.