American Airlines
American Airlines | మరో విమానంలో మంటలు.. భయంతో పరుగులు తీసిన ప్రయాణికులు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : American Airlines | విమానాల్లో సాంకేతిక లోపాలు, మంటలు చేలరేగడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా అమెరికన్​ ఎయిర్​లైన్స్​ విమానంలో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన డెన్వర్ విమానాశ్రయం (Denver airport)లో చోటు చేసుకుంది.

అమెరికా (America)లోని నార్త్ కరోలినాలోని షార్లెట్‌కు అమెరికా ఎయిర్​లైన్స్​ విమానం వెళ్లాల్సి ఉంది. అయితే రన్‌వేపై వేగంగా వెళ్తుండగా సమస్యను గుర్తించారు. ల్యాండింగ్​ గేర్​ పని చేయడం లేదని విమానాన్ని నిలిపేశారు. ఈ క్రమంలో ఒక్కసారిగా క్యాబిన్​లో మంటలు చెలరేగి పొగలు కమ్ముకున్నాయి. దీంతో ప్రయాణికులు భయంతో కేకలు పెట్టారు. వారిని వెంటనే స్లయిడ్‌ల నుంచి బయటకు తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఒకరు గాయపడినట్లు తెలిసింది. ఆ సమయంలో విమానంలో 150 మంది ప్రయాణికులు ఉన్నారు. కస్టమర్లు, సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు ఎయిర్​లైన్స్​ సంస్థ ప్రకటించింది. విమానాన్ని తనిఖీ చేయడం కోసం సేవల నుంచి తొలగించినట్లు పేర్కొంది.

American Airlines | బాబోయి ‘బోయింగ్’​

బోయింగ్ (Boeing) 737 MAX 8 విమానం టేకాఫ్‌కు ముందు రన్​వేపై ఉండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విమానాశ్రయంలోని అత్యవసర సిబ్బంది, డెన్వర్ అగ్నిమాపక విభాగం వెంటనే స్పందించి ప్రయాణికులను సురక్షితంగా తరలించారు. అయితే బోయింగ్​ విమానాల్లో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటుండడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.

అహ్మదాబాద్​లో ఎయిర్​ ఇండియాకు చెందిన బోయింగ్​ విమానం కూలిపోయి 270 మంది మృతి చెందిన విషయం తెలిసింది. ఇటీవల అమెరికాలో డెల్టా ఎయిర్​లైన్స్ (Delta Airlines)​కు చెందిన బోయింగ్​ విమానం గాలిలో ఉండగా ఒక ఇంజిన్​లో మంటలు చెలరేగాయి. దీంతో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్​ (Emergency Landing) చేశారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. అయితే వరుసగా బోయింగ్​ విమానాల్లో సమస్యలు వస్తుండడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.