అక్షరటుడే, వెబ్‌డెస్క్: Pine Labs IPO | ఫిన్‌టెక్ (Fintech) దిగ్గజం పైన్ ల్యాబ్స్ పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. సబ్‌స్క్రిప్షన్ ఈనెల 7న ప్రారంభం కానుంది. ఐపీవో (IPO) ద్వారా కంపెనీ రూ. 3,899 కోట్లు సమీకరించనుంది.
పైన్ ల్యాబ్స్‌ను (Pine Labs) 1998లో స్థాపించారు. కార్డ్ పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ నుంచి డిజిటల్ మరియు నగదు రహిత షాపింగ్ వ్యవస్థగా భారతదేశానికి సేవలందించే పూర్తి ఫిన్‌టెక్ ప్లాట్‌ఫాంగా ఎదగడానికి తన వ్యాపారాన్ని ప్రారంభించింది. ఇది పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) సొల్యూషన్స్, పేమెంట్ ప్రాసెసింగ్ మరియు మర్చంట్ ఫైనాన్సింగ్ సేవలను (Merchant Financing Services) అందించే భారతీయ మర్చంట్ కామర్స్ కంపెనీలలో ఒకటి.
దీని ప్రధాన కార్యాలయం నోయిడాలో ఉంది. ఈ కంపెనీ డిజిటల్ చెల్లింపు సాంకేతికతలు మరియు సేవలతో చిన్న, పెద్ద వ్యాపారాలతో సహా అన్ని పరిమాణాల వ్యాపారాలకు మద్దతు ఇస్తుంది. కంపెనీ పోర్ట్‌ఫోలియోలో స్మార్ట్ పీవోఎస్ (POS) పరికరాలు, బై నౌ పే లేటర్ (బీఎన్‌పీఎల్), మర్చంట్ ఫైనాన్సింగ్, లాయల్టీ అండ్ గిఫ్ట్ సొల్యూషన్స్ మరియు ఇ-కామర్స్, ఆన్‌లైన్ పేమెంట్ టూల్స్ (Online payment tools) వంటి విస్తృత శ్రేణి సేవలు ఉన్నాయి. డిజిటల్ చెల్లింపుల ప్రాసెసింగ్ సేవలందించే పైన్ ల్యాబ్స్‌కు భారత్‌తో పాటు మలేషియా, యూఏఈ, సింగపూర్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో కూడా కార్యకలాపాలు ఉన్నాయి.
Pine Labs IPO | రూ. 3,899.91 కోట్లు లక్ష్యం..
మార్కెట్ నుంచి రూ. 3,899.91 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో పైన్‌ల్యాబ్స్ కంపెనీ ఐపీవోకు (IPO) వస్తోంది. ఇందులో రూ. 2,080 కోట్లు ఫ్రెష్ ఇష్యూ కాగా మిగిలినది ఆఫర్ ఫర్ సేల్ ద్వారా సమీకరించనున్నారు. ఫ్రెష్ ఇష్యూ ద్వారా సమీకరించే నిధులను రుణాల చెల్లింపునకు, ఐటీ అసెట్స్‌లో పెట్టుబడులకు, క్లౌడ్ మౌలిక సదుపాయాల ఏర్పాటుకు వినియోగించనున్నట్లు కంపెనీ తెలిపింది.
ఆర్థిక పరిస్థితి : పైన్ ల్యాబ్ 2023 -24 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,824.16 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగా.. 2024 -25 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,327.09 కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో నికర లాభం(Net profit) రూ. 341.90 కోట్లనుంచి రూ. 145.49 కోట్లకు తగ్గింది. ఆస్తులు రూ. 10,715.74 కోట్లనుంచి రూ. 10,904.32 కోట్లకు పెరిగాయి.
ప్రైస్ బ్యాండ్ : కంపెనీ ఒక్కో ఈక్విటీ షేరు ధరను రూ. 210 నుంచి రూ. 221 గా నిర్ణయించింది. ఒక లాట్‌లో 67 షేర్లుంటాయి. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్ కోసం గరిష్ట ప్రైస్‌బ్యాండ్ (Price band) వద్ద రూ. 14,807తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గరిష్టంగా 13 లాట్ల కోసం బిడ్ దాఖలు చేయవచ్చు.
కోటా, జీఎంపీ : క్యూఐబీలకు (QIB) 75 శాతం, ఎన్‌ఐఐలకు 15 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 10 శాతం షేర్లను కేటాయించారు. కంపెనీ షేర్లకు గ్రేమార్కెట్‌లో డిమాండ్ ఉంది. ఒక్కో ఈక్విటీ షేరు రూ. 60 ప్రీమియంతో ట్రేడ్ అవుతోంది. అంటే లిస్టింగ్ రోజు 27 శాతం వరకు లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ముఖ్యమైన తేదీలు : సబ్‌స్క్రిప్షన్ (Subscription) ఈనెల 7న ప్రారంభమవుతుంది. 11న బిడ్డింగ్ గడువు ముగుస్తుంది. 12న రాత్రి అలాట్‌మెంట్ స్టేటస్ వెల్లడయ్యే అవకాశాలున్నాయి. కంపెనీ షేర్లు ఈనెల 14న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్టవుతాయి.
