అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | నిర్దేశించిన పరిమితిని దాటి వేగంగా వాహనం నడిపితే జరిమానాలు విధించనున్నట్లు ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం ఆయన కమాండ్ కంట్రోల్ రూంను (Command Control Room) పరిశీలించారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన వాహనదారులపై ఏ విధంగా ఈ-చాలన్లు విధిస్తున్నారనే వివరాలు తెలుసుకున్నారు.
Kamareddy SP | నేరాల నియంత్రణ కోసం..
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో నేరాల నియంత్రణ కోసం వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలన్నింటినీ పోలీస్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూంనకు అనుసంధానం చేశామన్నారు. ఈ కమాండ్ కంట్రోల్ ద్వారా ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన వారిని గుర్తించి, ఈ-చాలన్ల ద్వారా జరిమానాలు విధిస్తున్నట్లు చెప్పారు. సీసీ కెమెరాలు నేరాల నియంత్రణలోనే కాకుండా నిందితుల గుర్తింపులో కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు.
Kamareddy SP | మద్యం తాగి వాహనాలు నడపవద్దు..
జిల్లా ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించి వాహనాలు నడపరాదని, మైనర్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ చేయరాదని ఎస్పీ సూచించారు. మైనర్లకు వాహనాలు ఇచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లైసెన్స్ లేకుండా, నంబర్ ప్లేట్ సక్రమంగా లేకుండా, నంబర్ ట్యాంపరింగ్ చేసినా, నంబర్ తుడిపివేసిన వాహనాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, పట్టుబడిన వాహనాలపై సంబంధిత పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు.
ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు, మరణాలు, క్షతగాత్రుల సంఖ్యను తగ్గించే చర్యల్లో భాగంగా ఉన్నత న్యాయస్థానాలు, రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు 44వ జాతీయ రహదారి భిక్కనూరు నుంచి దగ్గి అటవీ ప్రాంతం వరకు వేగ పరిమితిని 80 కి.మీ.గా నిర్ణయించినట్లు తెలిపారు. వాహనదారులు ఈ విషయాన్ని గమనించి రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.