అక్షరటుడే, వెబ్‌డెస్క్: MP Arvind | జిల్లాలో ఎట్టకేలకు ఆర్వోబీ నిర్మాణాలు (ROB construction) తిరిగి ప్రారంభం అయ్యాయి. ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Dharmapuri Arvind) చొరవతో పనులు మొదలయ్యాయి. నిధుల విడుదలలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేయగా.. ఆయన పట్టుబట్టి మంజూరు చేయించారు. ఇందుకోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను (Deputy Chief Minister Bhatti Vikramarka) సైతం కలిశారు.
MP Arvind | అర్ధాంతరంగా నిలిచిన పనులు
జిల్లాలో కొన్ని నెలలుగా ఆర్వోబీల పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వ నిధులతో అర్సపల్లి, అడివి మామిడిపల్లి ఆర్వోబీలు నిర్మిస్తుండగా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్య పద్ధతిలో మాధవనగర్ ఆర్వోబీ పనులు చేపట్టిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మాణ పనులు నత్తనడకన కొనసాగాయి. గత ప్రభుత్వం నిధులను దారి మళ్లించిందని బీజేపీ నాయకులు ఆరోపించారు. సాక్షాత్తు రాష్ట్ర ఆర్అండ్బీ మంత్రిగా జిల్లాకు చెందిన ప్రశాంత్ రెడ్డి ఉన్నప్పటికీ పనులు ముందుకు సాగకపోవడం గమనార్హం.
MP Arvind | కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక..
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) అధికారంలో వచ్చిన తర్వాత కొన్ని రోజులు కొనసాగాయి. కానీ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నిధుల విడుదలలో జాప్యం ఏర్పడింది. దీంతో చేసేదేమి లేక గుత్తేదారులు కూడా పనులు నిలిపివేశారు. జిల్లా వాసుల దశాబ్దాల కల అయిన మాధవనగర్ ఆర్వోబీ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎంపీ అర్వింద్ పనులను వేగవంతం చేయాలని తరచూ సమీక్షల్లో అటు అధికారులు, ఇటు గుత్తేదారులపై ఒత్తిడి పెంచారు. నిధులు విడుదల చేయాలని గత సంవత్సరం డిసెంబర్లో నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని (CM Revanth Reddy) కలిసి కోరారు. సీఎంను కలిసిన తర్వాత నిధులు విడుదల కావడంతో అప్పట్లో కొన్ని నెలలు పనులు కొనసాగాయి.
MP Arvind | నిరాహార దీక్షకు దిగుతానని ఎంపీ అల్టిమేటం
ఆర్వోబీ పనులకు సంబంధించిన బిల్లులు నెలల తరబడి పెండింగ్ ఉండడంతో పరిస్థితి మొదటికి వచ్చింది. ఇటీవల ఓ మీడియా సమావేశంలో పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ (PCC Chief Bomma Mahesh Kumar Goud) నిధులు కేంద్రం వద్దే పెండింగ్‌లో ఉన్నాయని అనడం ఎంపీ అర్వింద్‌కు ఆగ్రహం తెప్పించింది. దీంతో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఎంపీ.. రాష్ట్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న విషయాన్ని కుండబద్దలు కొట్టి చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో నిధులు విడుదల చేయాల్సిందేనని.. లేనిపక్షంలో నిరాహార దీక్షకు సైతం దిగుతానని ప్రకటించారు. గత నెల 29న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కను సైతం కలిసిన ఎంపీ అర్వింద్.. నిధులు వెంటనే విడుదల చేయాలని కోరారు. మంత్రి భట్టి సైతం త్వరలోనే నిధులు విడుదల చేస్తానని హామీ ఇచ్చారు.
MP Arvind | నిధుల విడుదలతో..
పది రోజుల క్రితం మాధవనగర్ ఆర్వోబీకి రూ. 3.15 కోట్లు, అర్సపల్లి ఆర్వోబీకి రూ. 7.46 కోట్లు, అడివి మామిడిపల్లి ఆర్వోబీకి రూ. 3 కోట్ల నిధులు విడుదలయ్యాయి. దీంతో మాధవ నగర్ వద్ద నిజామాబాద్ వైపు సర్వీస్ రోడ్డు పనులు ప్రారంభం అయ్యాయి. అటు అడవి మామిడిపల్లి బీటీ రోడ్డు (Mamidipalli BT road) పనులు సైతం నేడో రేపో ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు. వారం నుంచి పది రోజుల్లో పనులు పూర్తి చేయాలని ప్రణాళికలు రూపొందించారు. కాగా.. పనుల ప్రారంభం కావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
