అక్షరటుడే, హైదరాబాద్: MLAs’ party defection : తెలంగాణ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసు తుది దశకు చేరుకుంది. ఈ కేసులో సుప్రీంకోర్టు నేడు(జులై 31, గురువారం) తుది తీర్పు వెలువర్చనుంది.
బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్లో చేరిన 10 మంది శాసన సభ్యులపై దాఖలైన పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ ఇంత వరకు నిర్ణయం తీసుకోలేదు. దీనిని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద పిటిషన్లు దాఖలు చేశారు.
వీటిపై సుప్రీంకోర్టు ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపింది. ఇరు పక్షాల వాదనలను సుప్రీంకోర్టు ఇప్పటికే ఆలకించింది. తీర్పును కూడా రిజర్వు చేసింది. నేడు తుది తీర్పును వెలువర్చనుంది. బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆ పది మంది శాసన సభ్యుల భవితవ్యం నేడు తేలిపోనుంది.
కాగా, ‘సుప్రీం’ తీర్పుపై ఎమ్మెల్యేలతో పాటు, తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. నేడు ఉదయమే తీర్పు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
MLAs’ party defection : పిటిషన్ల దాఖలు..
ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP) దాఖలు చేశారు. ఎం.సంజయ్ కుమార్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, కాలె యాదయ్య, అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డిపై పిటిషన్ దాఖలు అయ్యాయి. కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, ఇతర భారాస నేతలు ఈ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ఇప్పటికే సుప్రీం కోర్టు (Supreme Court) పలుమార్లు విచారణ జరిపింది.