అక్షరటుడే, వెబ్‌డెస్క్ : IND vs AUS | ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను (five-match T20I series) ఇండియా కైవసం చేసుకుంది. శనివారం గబ్బాలో జరగాల్సిన చివరి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో భారత జట్టు 2-1 తేడాతో సిరీస్‌ను గెలుచుకుంది. ఈ క్రమంలో ఇండియా సరికొత్త రికార్డును నెలకొల్పింది.
గత 17 సంవత్సరాలుగా ఆసిస్‌తో జరిగిన అన్ని టీ20 సిరీస్‌లను భారత్ నిలబెట్టుకుంటూ వస్తోంది. ఆస్ట్రేలియాలో (Australia) రెండు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఎప్పుడూ కోల్పోలేదు. సిరీస్ నిలబెట్టుకునే సంప్రదాయాన్ని 2008 నుంచి కొనసాగిస్తోంది. ఇండియాలో ఇరు జట్ల మధ్య జరిగిన ఒకే ఒక T20Iలో వారు ఓడిపోయారు. కానీ ఒక్క సిరీస్‌లో కూడా వారు ఓడిపోలేదు. ఇప్పుడు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో రెండు వర్షం కారణంగా రద్దయ్యాయి. రెండింటిలో భారత్, ఒకటి ఆసిస్ (India and Australia) విజయం సాధించాయి.
IND vs AUS | 4.5 ఓవర్ల మ్యాచ్..
గబ్బాలో (Gabba) శనివారం జరిగిన చివరి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన తర్వాత భారత్ 4.5 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేయగలిగింది. ఉరుములు మెరుపులతో కూడిన వాన కారణంగా ఆట ఆగిపోయింది. వర్షం కొనసాగుతుండడం, మ్యాచ్ తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలు లేకపోవడంతో రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.
4.5 ఓవర్లలోనే ఇండియా జట్టు వికెట్ కోల్పోకుండా 52 పరుగులు చేసింది. నాలుగో టీ20లో జరిగిన పరిణామాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) ఈ మ్యాచ్‌లో జోరు ప్రదర్శించాడు. 16 బంతుల్లో 29 పరుగులు చేశాడు. మరోవైపు.. ఆస్ట్రేలియా ఫీల్డర్ల పొరపాట్లతో రెండుసార్లు బతికిపోయిన మరో ఓపెనర్ అభిషేక్ శర్మ 13 బంతుల్లో 23 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
IND vs AUS | అభిషేక్ శర్మ అరుదైన రికార్డు..
భారత్ తరఫున టీ20ల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన అభిషేక్ శర్మ (Abhishek Sharma).. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా ఎంపికయ్యాడు. ఈ మైలురాయిని చేరుకోవడానికి ఈ అద్భుతమైన ఓపెనర్ కేవలం 528 బంతులు మాత్రమే తీసుకున్నాడు. 573 బంతుల్లో ఈ మైలురాయిని చేరుకున్న కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను అతడు అధిగమించాడు.
IND vs AUS | భారత్ జైత్రయాత్ర..
టీ20ల్లో ప్రపంచ ఛాంపియన్ అయిన ఇండియన్ క్రికెట్ టీమ్ (Indian cricket team) జైత్రయాత్ర కొనసాగిస్తోంది. 2023 డిసెంబర్ నుంచి టీ20 సిరీస్‌లలో వరుస విజయాలు సాధిస్తోంది. భారత్ చివరి వెస్టిండిస్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను కోల్పోయింది. ఆ తర్వాత 2023 డిసెంబర్లో దక్షిణాఫ్రికాలో సిరీస్ 1-1తో డ్రా కాగా.. ఆ తర్వాత నుంచి ఇండియా వరుసగా 12 టీ20 సిరీస్‌లను గెలుచుకోవడం విశేషం..
