అక్షరటుడే, కామారెడ్డి: Fever survey | జంగంపల్లి ఆస్పత్రి పరిధిలో ఫీవర్ సర్వే చేపట్టి డెంగీ కేసులు (Dengue cases) ఎక్కడైనా నిర్దారణ అయితే క్యాంప్‌లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) వైద్యులను ఆదేశించారు. ఆయన మంగళవారం భిక్కనూరు (Bhiknoor) మండలం జంగంపల్లి పల్లె దవాఖానాను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆస్పత్రిలోని ఓపీ, ఏఎన్సీ చెకప్ తదితర వివరాలను ఆరా తీశారు. ఆస్పత్రి పరిధిలో తరచూ ఫీవర్ సర్వే నిర్వహించాలని, ఎక్కడైనా డెంగీ వంటి వ్యాధులు నిర్ధారణ అయితే వెంటనే వైద్యులను అప్రమత్తం చేసి మెడికల్ క్యాంప్‌లను నిర్వహించాలని ఆదేశించారు.
పరిసరాల్లో ఎక్కడా నీరు నిల్వ కాకుండా చూసుకోవాలని, శానిటేషన్ పనులు సక్రమంగా జరగాలని ఆదేశించారు. ఆస్పత్రిలో నిర్వహించే రోజువారీ కార్యక్రమాలను రిజిస్టర్లలో నమోదు చేయడంతోపాటు వాటిని ధృవీకరించాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్, డిప్యూటీ వైద్యాధికారి ప్రభుకిరణ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.