అక్షరటుడే, వెబ్‌డెస్క్ : E-Commerce | దసరా పండుగ సమీపిస్తోంది. షాపింగ్ సందడి పెరగనుంది. పండుగ సీజన్‌ను సొమ్ము చేసుకునేందుకు ఇ-కామర్స్(E-Commerce) సంస్థలు ఇప్పటికే ప్రత్యేక డేస్‌ను ప్రకటించాయి. ఈనెల 23 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్(Big Billion Days Sale), అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభించనున్నాయి. లక్షల కోట్ల రూపాయల వ్యాపారం చేయనున్నాయి.
ఈ డిమాండ్‌కు అనుగుణంగా రెండు సంస్థలు మ్యాన్ పవర్‌ను తాత్కాలిక పద్ధతిలో పెంచుకుంటున్నాయి. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మింత్రా(Myntra) వంటి ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలన్నీ కలిపి సుమారు 4 లక్షల వరకు తాత్కాలిక ఉద్యోగావకాశాలు కల్పించినట్లు తెలుస్తోంది. ఇందులో ఫ్లిప్‌కార్ట్ ముందుంది. ఆ సంస్థ 2.2 లక్షల వరకు సీజనల్ ఉద్యోగులను నియమించుకుంది. తర్వాతి స్థానంలో అమెజాన్(Amazon) నిలిచింది. గతేడాదితో పోలిస్తే ఈసారి పండుగ సీజన్‌లో హైరింగ్ 20 నుంచి 25 శాతం వరకు పెరిగే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. మెట్రోపాలిటన్ నగరాలతో పాటు జైపూర్, కోయంబత్తూర్, ఇండోర్, నాగ్‌పూర్‌లాంటి ద్వితీయ శ్రేణి పట్టణాలు కూడా హైరింగ్ హబ్‌లుగా మారుతున్నాయి. ప్రధాన ఇ-కామర్స్ సంస్థల వారీగా నియామకాల వివరాలు ఇలా ఉన్నాయి.
ఫ్లిప్‌కార్ట్ : పండుగ సేల్‌ను ముందుగానే ప్రకటించి పోటీలో ముందు నిలిచిన ఫ్లిప్‌కార్ట్.. ఉద్యోగావకాశాలు కల్పించడంలోనూ ముందుంది. ఈ సంస్థ దసరా పండుగ సీజన్ కోసం దేశవ్యాప్తంగా 2.2 లక్షల మందిని నియమించుకుంది. కొత్తగా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో 650 డెలివరీ హబ్(Delivery Hub)లను ఏర్పాటు చేయడం గమనార్హం.
అమెజాన్ : గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్(Great Indian Festival Sale) పేరుతో పండుగ సీజన్ సేల్‌ను ప్రకటించిన అమెజాన్.. దేశవ్యాప్తంగా 1.5 లక్షల మందికిపైగా తాత్కాలిక ఉద్యోగులను నియమించుకుంది. కొత్తగా 12 ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్స్ ప్రారంభించిన అమెజాన్.. ఆరింటిని మరింత విస్తరించింది. మరో ఆరు సోర్టింగ్ సెంటర్లను ఏర్పాటు చేసింది.
మింత్రా : ఫ్యాషన్, లైఫ్‌స్టయిల్ విభాగాల్లో ఇ-కామర్స్ సేవలందిస్తున్న మింత్రా.. దసరా సీజన్ నేపథ్యంలో 11,000 మందికి సీజనల్ ఉద్యోగాలు(Seasonal Jobs) ఇచ్చింది. లాజిస్టిక్స్, కస్టమర్ సర్వీస్, లాస్ట్‌మైల్ డెలివరీ విభాగాల్లో నియామకాలు చేపట్టింది. ఇతర ఇ-కామర్స్ సంస్థలు సైతం తమ సేవల కోసం తాత్కాలిక సిబ్బందిని నియమించుకున్నాయి.