అక్షరటుడే, వెబ్‌డెస్క్ : GST | దీపావళిలోగా జీఎస్టీ తగ్గిస్తామన్న మాటను కేంద్ర ప్రభుత్వం నిలబెట్టుకుంది. వస్తు సేవల పన్ను (జీఎస్టీ)లో సంస్కరణలకు జీఎస్టీ కౌన్సిల్ (GST Council) మద్దతు తెలపడంతో చాలా వస్తువుల ధరలు (Commodity Prices) తగ్గనున్నాయి. ఈ నెల 22 నుంచే మార్పు అమలులోకి రానుంది.
దీంతో మన మార్కెట్లకు నెల రోజుల ముందే పండుగ రానుంది. జీఎస్టీ స్వరూపంలో కేంద్రం కీలక మార్పులు చేసింది. ప్రస్తుతం ఉన్న నాలుగు శ్లాబ్‌లకు స్వస్తి పలికి.. రెండు శ్లాబ్‌ల విధానానికి శ్రీకారం చుట్టారు. ఇకపై 12, 28 శాతం శ్లాబ్‌లు ఉండవు. 5, 18 శాతం స్లాబ్‌లు మాత్రమే ఉంటాయి. ఈ మేరకు బుధవారం జీఎస్టీ కౌన్సిల్ 56వ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. గుట్కా, పొగాకు, పొగాకు ఉత్పత్తులు, సిగరెట్లపై (Cigarettes) మినహా మిగిలిన ఉత్పత్తులపై పన్ను మార్పులు ఈనెల 22 నుంచే అమలులోకి రానున్నాయి. రోటీ, పరోటాలపై జీఎస్టీని పూర్తిగా తొలగించారు.
లైఫ్ సేవింగ్ డ్రగ్స్, మెడిసిన్స్‌పై (Medicines) 12 శాతం జీఎస్టీ తొలగించి, సున్నాకు తీసుకువచ్చారు. హెయిర్ ఆయిల్, కార్న్‌ఫ్లేక్స్, టీవీలు, పర్సనల్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్, ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గే అవకాశాలు ఉన్నాయి. అయితే ఖరీదైన కార్లు కొనుగోలు చేయాలనుకుంటున్నవారిని మాత్రం జీఎస్టీ కౌన్సిల్ నిరాశపరిచింది. వీటిపై 40 శాతం జీఎస్టీ శ్లాబ్‌ను ప్రతిపాదించారు. పొగాకు ఉత్పత్తులు, సిగరెట్లనూ ఈ శ్లాబ్ పరిధిలో సూచించారు. రేస్ క్లబ్బులు, లీజింగ్/రెంటల్ సేవలు, క్యాసినోలు, జూదం, గుర్రపు పందేలు, లాటరీ, ఆన్‌లైన్ మనీ గేమింగ్‌పై 40శాతం పన్ను విధించనున్నారు.
దేశీయ వినియోగాన్ని గణనీయంగా ప్రోత్సహించడం ద్వారా వాణిజ్యాన్ని పరుగులు పెట్టించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని భావిస్తున్నారు. సామాన్యులపై ఆర్థిక భారం పడకుండా జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు తీసుకుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తెలిపారు. రైతులు (Farmers), సామాన్యులను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నామన్నారు. కామన్ మ్యాన్, మిడిల్ క్లాస్ ఉపయోగించే వస్తువులన్నింటిని ఐదు శాతం పన్ను పరిధిలోకి తెచ్చామని, పాలు, రోటీ, బ్రెడ్‌పై ఎలాంటి పన్ను లేదన్నారు. అన్ని నిర్ణయాలనూ ఏకాభిప్రాయంతో తీసుకున్నామని, ఏ రాష్ట్రమూ దీనిని వ్యతిరేకించలేదని పేర్కొన్నారు. శ్లాబ్‌ల మార్పు వల్ల రూ. 48వేల కోట్ల మేర ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోతుందని రెవెన్యూ శాఖ కార్యదర్శి అరవింద్ శ్రీవాస్తవ (Revenue Secretary Arvind Srivastava) తెలిపారు.
GST | పన్నులు తగ్గే రంగాలు..
- 33 ఔషధాలపై జీఎస్టీ 12 శాతం నుంచి సున్నాకు తగ్గింపు
- హస్తకళా ఉత్పత్తులు, పాలరాయి, గ్రానైట్ దిమ్మెలపై జీఎస్టీని 5 శాతానికి పరిమితం చేశారు.
- వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ 12 నుంచి 5 శాతానికి తగ్గింది.
- చాలా ఎరువులపై జీఎస్టీని 18 నుంచి 5 శాతానికి కుదించారు.
- సిమెంటుపై 28 నుంచి 18 శాతానికి తగ్గించారు.
- ఏసీ, టీవీ, డిష్ వాషర్లు, చిన్నకారులపై పన్నును 28 నుంచి 18 శాతానికి తగ్గించారు.
- ఎలక్ట్రిక్ వాహనాలపై 5 శాతం పన్ను కొనసాగనుంది.
GST | పెరిగేవి ఇవే..
పాన్ మసాలా, సిగరెట్, గుట్కా, పొగాకు ఉత్పత్తులపై 40 శాతం జీఎస్టీ విధించాలని యోచిస్తున్నారు.
350 సీసీ కంటే తక్కువ సామర్థ్యం గల వాహనాలపై 18 శాతం జీఎస్టీ. 350 సీసీ దాటిన వాహనాలపై 40 శాతం పన్ను విధింపు యోచన. కార్పొనేటెడ్ కూల్‌డ్రింక్స్, జ్యూస్‌లపై 40 శాతం జీఎస్టీ విధించనున్నారు.