Homeక్రైంHyderabad | హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: మద్యం మత్తులో థార్ కారు వేగంగా దూసుకెళ్లి...

Hyderabad | హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: మద్యం మత్తులో థార్ కారు వేగంగా దూసుకెళ్లి ఐదుగురికి గాయాలు

మందుబాబులు మ‌ద్యం మ‌త్తులో ప్రాణాలు తీస్తున్నారు. పోలీసులు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నా కూడా ఏ మాత్రం భ‌యం లేకుండా విచ్చ‌ల‌విడిగా తాగి ఎదుటి వారి ప్రాణాన్ని హ‌రిస్తున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hyderabad | హైదరాబాద్ నగర శివారులో శనివారం అర్ధరాత్రి ఘోర‌ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సంఘటన ఎల్‌బీనగర్ నియోజకవర్గం (LB Nagar constituency) పరిధిలోని బీఎన్‌రెడ్డినగర్ సమీపంలోని గుర్రంగూడ వద్ద జ‌రిగింది.

మద్యం మత్తులో థార్ కారు న‌డుపుతున్న వ్య‌క్తి అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టిన‌ ఘటనలో మొత్తం ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, ఇంజాపూర్‌ నుండి గుర్రంగూడ వైపు అతివేగంగా ప్రయాణిస్తున్న థార్ కారును డ్రైవ్ చేస్తున్న వ్యక్తి మద్యం సేవించి ఉండగా వేగాన్ని నియంత్రించలేకపోయిన అతను ముందు వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టాడు.

Hyderabad | ఘోర ప్రమాదం..

ఆ బైక్‌పై సిరిసిల్ల జిల్లాకు (Sirisilla District) చెందిన ఇద్దరు విద్యార్థులు ప్రయాణిస్తుండగా, ఈ ఢీకొట్టిన ఘటనలో విద్యార్థులు తీవ్ర గాయాలు పాలయ్యారు. అందులో ఒక విద్యార్థినికి తలకు తీవ్ర గాయమవడంతో ఆమెను తక్షణం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.ఈ ప్రమాదంలోథార్ కారు డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టింది. ఆ కారులో ఉన్న దినేష్, శివ అనే ఇద్దరూ గాయపడ్డారు. కారుని ఢీకొట్టిన త‌ర్వాత థార్ కారు (Thar Car) అదుపు తప్పి మూడు పల్టీలు కొట్టి రోడ్డుపక్కనే బోల్తా పడింది. వాహనంలో ప్రయాణిస్తున్న డ్రైవర్‌తో పాటు కారుయజమాని అనిరుధ్ తలకు తీవ్ర గాయాలు కావడంతో, అతనిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనలో గాయపడిన ఐదుగురిని హస్తినాపురంలోని రెండు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స నిమిత్తం చేర్చారు. వారి ఆరోగ్య పరిస్థితిపై ఇంకా స్పష్టత రాలేదని, విచారణ అనంతరం పూర్తి సమాచారం వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు.ప్రమాదానికి కారణమైన థార్ Thar వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని, డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. మద్యం సేవించి వాహనం నడిపిన విషయంపై ఫోరెన్సిక్ నివేదిక కోసం వేచి చూస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటన నగరంలో మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తున్న వారిపై మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని మళ్లీ గుర్తు చేసింది.