అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Tirumala | భక్తుల భాగస్వామ్యంతో సనాతన ధర్మ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు (TTD Chairman BR Naidu) తెలిపారు.
దేశ విదేశాల నుంచి తిరుమలకు వస్తున్న భక్తులకు సౌకర్యవంతంగా స్వామి వారి దర్శనం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆయన తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో గల పరేడ్ గ్రౌండ్లో జెండా ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఆదేశాల మేరకు భక్తులకు ఏఐ టెక్నాలజీ (AI Technology)ని ఉపయోగించి మరింత వేగంగా, సౌకర్యవంతంగా శ్రీవారి దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
Tirumala | ప్రత్యేక కౌంటర్లు
భక్తులకు అందించే అన్నప్రసాదాల్లో నాణ్యత పెంచి ఎక్కువ మందికి అందిస్తున్నట్లు ఛైర్మన్ పేర్కొన్నారు. రద్దీ ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక కౌంటర్ల ద్వారా అన్నప్రసాదాలు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ప్రతి మూడు గంటలకు ఒకసారి అన్నప్రసాదం, చిన్న పిల్లలకు పాలు అందిస్తున్నట్లు వెల్లడించారు. తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో భక్తులకు వడ వడ్డిస్తునట్లు పేర్కొన్నారు.
Tirumala | నూతన టికెట్ల జారీ కేంద్రం
శ్రీవాణి టికెట్లు (Srivani Tickets) పొందే భక్తుల సౌకర్యార్థం ఇటీవల అత్యాధునిక సౌకర్యాలతో నూతన టికెట్ల జారీ కేంద్రం అందుబాటులోకి తెచ్చినట్లు ఛైర్మన్ తెలిపారు. శ్రీవాణి టికెట్లు ఉదయం జారీ చేసి అదేరోజు సాయంత్రం 5 గంటలకు దర్శనం కల్పిస్తున్నట్లు చెప్పారు. కల్యాణ కట్ట అభివృద్ధికి చర్యలు చేపట్టామన్నారు. తిరుమల అటవీ ప్రాంతంలో పచ్చదనాన్ని పెంపొందించేందకు చర్యలు చేపట్టామని చెప్పారు.
Tirumala | ల్యాబ్ ఏర్పాటు
భద్రతా చర్యల్లో భాగంగా తిరుమలలో యాంటీ డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. తాగునీరు, ఆహార పదార్థాలు, ముడి సరుకులు, నెయ్యి నాణ్యతను ఎప్పటికప్పుడు పరిక్షించేందుకు ల్యాబ్ నిర్మాణానికి స్థలం కేటాయించినట్లు చెప్పారు. టీటీడీ అనుబంధ ఆలయాలను సైతం అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో టీటీడీ ఆలయాలు నిర్మిస్తామన్నారు.
టీటీడీ విద్యాసంస్థల్లో నాణ్యమైన బోధన, వసతి, భోజన ఇతర సౌకర్యాలు కల్పించడంతో విద్యార్థుల ఉత్తీర్ణతా శాతం బాగా పెరిగిందన్నారు. ఇప్పటికే కొంతమంది అన్యమత ఉద్యోగులపై చర్యలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. టీటీడీలో ఉన్న అన్యమత ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ ఇచ్చేందుకు బోర్డు ఆమోదం తెలిపిందన్నారు.
Tirumala | సెప్టెంబర్ 24 నుంచి బ్రహ్మోత్సవాలు
తిరుమల వేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు (Brahmotsavam) సెప్టెంబరు 24 నుంచి అక్టోబరు 2 వరకు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో శ్యామలరావు తెలిపారు. ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు. భక్తులు శ్రీవారి మూలమూర్తితో పాటు వాహనసేవలను దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేపట్టినట్లు వెల్లడించారు. రూ.145 కోట్లతో తిరుమలలో ఎస్వీ మ్యూజియం నూతన హంగులతో నిర్మిస్తున్నామన్నారు.
భద్రతా వ్యవస్థను ఆధునికీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. అలిపిరి తనిఖీ కేంద్రం ఆధునీకరణ, అధిక సామర్థ్యం కలిగిన స్కానర్లు, త్వరితగతిన తనిఖీలు పూర్తి, పార్కింగ్, ట్రాఫిక్ మేనేజ్మెంట్ వ్యవస్థలను అప్డేట్ చేస్తున్నట్లు వెల్లడించారు.